Monday, 21 November 2011

amaresvara jyotirlingamu in om karesvaramu (madhya pradesh)

                                                                                               
                                                         ఓం  నమశ్శివాయైచ  నమ శ్శివాయ.

      ఓం కారే  అమరేశ్వరం. ఆంధ్రా నుంచి  మహారాష్ట్ర  వచ్చిన  అమ్మకు  వీలైనప్పుడల్లా దగ్గరలోని జ్యోతిర్లింగములను  దర్శించుకునే భాగ్యము కలిగించాలని  మా బాబు తాపత్రయం. అమ్మతో కలిసి ఆ అర్ధనారీశ్వరులను దర్శించుకోవటం  బాబుకి  బహు  మక్కువ. ఈసారి మధ్య ప్రదేశ్ లో ఉన్న ఓంకారే శ్వరం, అలాగే ఉజ్జయిని క్షేత్రాలని సందర్శిద్దామని అనుకున్నాం. మార్చి 25 రాత్రి ముంబయ్ లో 8 : 30 బయలుదేరి ఖాండ్వా  వరకు రైలు లో వెళ్ళి,  అక్కడి నుంచి  ఓం కారేశ్వరం వెళ్లేసరికి ఉదయం 11 : 30 అయినది. గుడికి దగ్గరలోనే ఒక హోటల్ లో రూం తీసుకున్నాము.  రెండో అంతస్తు లో ఉన్న రూం నుంచి చూస్తే ఓంకారేశ్వరస్వామి  గుడి, దూరంగా ఉన్న పెద్ద శివుని  ప్రతిమ చక్కగా కనిపిస్తున్నాయి.  కాసేపు  విశ్రాంతి తీసుకుని  కొంచెం అల్పాహారం తిని, 3 : 30 కి  గుడికి బయలుదేరాము. ఓంకారేశ్వరం చేరే ముందు నర్మదా నది రెండుగా చీలి ఆ స్వామి గుడి  చుట్టూ ప్రవహించి మళ్ళీ ఒక చోట కలుస్తుంది.  మేము నర్మదా నదీమ తల్లికి నమస్కరించి, ఓంకారేశ్వర ఘట్టం లో స్నానం చేసి గుడిలోనికి వెళ్ళాము.

గుడిలో ప్రవేశించడానికి ముందు అక్కడ ఉన్న వినాయక స్వామికి, నందీశ్వరునికి నమస్కరించి లోపలికి వెళ్ళాము. అద్భుతం, అమోఘం. అమరేశ్వర స్వామి ని చూట్టానికి రెండు కళ్ళు చాలవనిపించింది. శివయ్య వెనుకే అమ్మవారు చాలా మనోహరంగా ఉన్నారు. జ్యోతిర్లింగం ఓం ఆకారం లో ఉన్నట్లు  ఉంటుంది.  పూలు,ప్రసాదం ఆ  ఆది దంపతులకు సమర్పించి  కాసేపు అక్కడే కూర్చుని   మనసారా  ధ్యానించుకున్నాము. ఇక్కడ జ్యోతిర్లింగము తాకకూడదట, తాకటానికి  వీలు లేకుండా కడ్డీలు అడ్డం ఉన్నాయి. ఆ జగజ్జననీజనకులను కన్నులారా వీక్షించి  నమస్కరించుకుని  ఇంకా జనం వస్తూ ఉండడంతో   వచ్చిహాలులోకూర్చున్నాము. బాబు  అన్నాడు, మళ్ళీ వెళ్ళి వద్దామని. సరే అని ఒకరి తర్వాత ఒకరం వెళ్ళి వచ్చాము. పూజారులు  గుర్తు పట్టి ఎన్ని సార్లు వస్తారు అని అన్నారు (హిందీలో). అంటేలే  అని చక్కగా తనివి తీరా దర్శనం చేసుకుని నమస్కరించుకుని వచ్చి కూర్చున్నాము. పక్కనే నర్మదా నది  ప్రవహిస్తూ, నదికి ఆవలి వైపున ఉన్న పరిసరాలు కనిపిస్తూ చాలా సుందరంగా ఉంది దృశ్యం. అక్కడినుంచి ఉన్న మెట్ల ద్వారా పైకి వెళ్తే ఇంకొక శివలింగం (మహాకాళేశ్వర స్వామి), అమ్మవారు ఉన్నారు. ఆ పైన సన్నగా ఇంకొక మెట్ల దారి ఉంది. అందులోనించి వెళ్తుంటే ఒక గుహ లాగా చీకటిగా ఉంది. అలాగే వెళ్తే అక్కడ శివ లింగాలు, ఎటుచూసినా శివయ్యే.



ఓంకారేశ్వర క్షేత్రం లో విశేషం పరిక్రమ. ఓంకారేశ్వర ద్వీపం చుట్టూ నడుస్తూ, అక్కడ ఉన్న అనేక క్షేత్రాలను, ఆలయాలను దర్శించడం అన్నమాట. పరిక్రమ చేద్దామనుకుని సాయంత్రం 5 గంటలకు మొదలు పెట్టాము. 3 గంటలకు పైగా పడుతుంది అని చెప్పారు. అక్కడక్కడ చిన్నగుడిసెలు ఉన్నాయి. అప్పుడప్పుడు వాటిలో నివాసం ఉండే గ్రామస్తులు తారసపడుతున్నారు. దారిలో సింటెక్స్ ట్యాంక్లలో మంచినీళ్ళు అందుబాటులో ఉన్నాయి. .నర్మదా నీళ్ళే కదా, చాలా బాగున్నాయి. దారిలో ఉన్న దేవాలయాలు దర్శించుకుంటూ  వస్తున్నాము. ఎంతో పురాతనమైన ఆ ఆలయాలు ఈ క్షేత్రం యొక్క చరిత్రను స్ఫురణకు తెస్తున్నాయి. ఆ సాయంవేళలో అలా నర్మదా పరీవాహంలో నడుస్తుంటే నీరసమే తెలీలేదు. ఏదో కొత్త చైతన్యం పుట్టుకొచ్చింది. సాయంభానుని అనన్య శోభకి పరిసరాలన్నీ సిందూర  వర్ణం లో శోభిస్తున్నాయి. మునుపెన్నడూ చూడనంత సౌందర్యం నలువైపులా వెల్లివిరిసింది. కొంత సేపటికి పవిత్ర నర్మదా నదీ సంగమం చేరుకున్నాము. ఆహా ఎంత అద్భుతం, అంత దగ్గరగా ఆ సంగమం, ఆ జల పాత హోరు ప్రత్యక్షంగా చూస్తుంటే ఆ  ఆనందం  వర్ణనాతీతం. పరిక్రమ చేసే మార్గంలో శిలాఫలకముల పై భగవద్గీతా శ్లోకాలను భావసహితంగా చెక్కి ఉంచారు. ప్రాచీన కాలం నాటి  అపురూపమైన  గౌరీ సోమనాథ దేవాలయం చేరుకున్నాం. ఆ కళా నైపుణ్యం మహాద్భుతం. లోపల విశాలమైన, ఏంతో ఎత్తైన పెద్ద శివ లింగం. వెలుపల కూడా చాలా పెద్ద నందీశ్వరుడు. అప్పుడు సాయంత్రం 6 : 30 అయింది. ప్రదోష సమయం కదా. ఆ  నాట్య కళా సాకార  తాండవ శోభనామూర్తి  శివశంకరునికి మనస్పూర్తిగా పూజచేసుకుని, తృప్తిగా నమస్కరించుకుని  పయనం సాగించాము. వెళ్తూ ఉండగా, హోటల్ రూం నుంచి కనిపించిన అతి పెద్ద  మహాదేవుని  ప్రతిమని చేరుకున్నాము. ఆకాశమే ఆహార్యమై  అలరారు తున్నట్లు గా  మహోన్నతంగా  ఉంది. విగ్రహం కింద భాగంలో ఆలయం ఉంది. ప్రహరీ గోడ చుట్టూ  18  అమ్మవారి  శక్తి  ప్రతిమలు ఉండి ఎంతో శోభాయమానంగా   అలరారుతున్నాయి.  అడుగడునా  సుందర  దృశ్యాలను  బాబు తన కెమేరాలో పొందుపరుస్తున్నాడు. అప్పటికి  చీకటి పడుతుంది. లైట్లు కొంచెం దూరంగా ఉండడం తో సెల్ లో లైటు సహాయంతో, శివ నామ స్మరణతో నడుస్తూ ఉన్నాము. మెట్లు ఎక్కేటప్పుడు నాకు కొంచెం కష్టంగా  ఉంటే బాబు మెల్లగా చేయి పట్టుకుని తీసుకొస్తున్నాడు. ఆ..అదిగో గుడి కనిపిస్తుంది.. వచ్చేశాం. అవునా  మేమేనా  అంత దూరం నడిచింది. అంతా ఆ  అమరేశ్వరుని దయ. ఎలా నడుస్తామో అనుకున్న మాకు  కొంచెం కూడా అలసట కానీ, కాళ్ళు నొప్పులు కానీ తెలీలేదు. ధన్యోస్మి మహాదేవా అనుకుంటూ త్వరగా గుడిలోనికి  వెళ్ళి, మరలా దర్శనం చేసుకున్నాము.


 అమలేశ్వర జ్యోతిర్లింగం నుంచి విభజించబడి నర్మదా నదికి మరో ఒడ్డున వెలిసిన జ్యోతిర్లింగమే మామలేశ్వర లింగం.  అక్కడినించి  మామ లేశ్వర స్వామి గుడికి  వడి వడి గా బయలుదేరాము. రాత్రి 8 : 30 దాటడంతో తలుపులు  వేస్తారేమో అని చాలా వేగంగా వెళ్ళి గుడికి చేరుకున్నాము. ఆహా ఏమి మా అదృష్టం. మా మనః  పారవశ్యాన్ని వర్ణింపనలవి  కాదు. అక్కడ మామలేశ్వర స్వామికి  అభిషేకము, పూజ చేస్తున్నారు. పూజారి  చాలా వయో వృద్ధులు. కానీ  వృద్ధాప్యం వయసుకే గాని, మనో నిశ్చయానికి కాదు అన్నట్లు  వారు  ఎంతో  భక్తి భావన  తో  స్పష్టంగా మంత్రోచ్ఛారణ  చేస్తూ   స్వామికి అభిషేకము,  పూజ   చేస్తుంటే మా  మది  హర్షాతిరేకంతో పొంగిపోయింది. అక్కడ ఇంకా నలుగురు ఆడవారు కూర్చుని ఉన్నారు. మేము ప్రక్కన  పూజ చూస్తూ కూర్చున్నాము. హారతి తీసుకుని మహాదేవునికి, అమ్మవారికి నమస్కరించుకుని  తృప్తిగా అక్కడినించి కదిలాము. వస్తూ గుడి ఆవరణ లోనే ఉన్న శివాలయాలు  సందర్శించి  రూం కి వెళ్ళేసరికి రాత్రి  9 : 30 అయింది. దగ్గరలో ఉన్న హోటల్ కి వెళ్ళి ఆలూ పరాటా, పన్నీర్  పరాటా కొంచెం అన్నం తో భోజనం చేసి రూం కి వెళ్ళి ఉదయం త్వరగాలేచి  శివయ్యని  చూడాలి అనుకుంటూ నిద్రకు ఉపక్రమించాము.

తెల్లవారు ఝాము 4 : 30 కి లేచి 5 గంటలకు పవిత్ర నర్మదా నది లో స్నానం చేసి  మామ లేశ్వర స్వామి  సన్నిధికి వెళ్ళాము. అప్పటికే స్వామికి అభిషేకం చేస్తున్నారు. కొంచెం సేపు కూర్చుని హారతి తీసుకుని లోపలికి వెళ్ళాము. ఆ దేవ దేవుని  తన్మయత్వం తో  అలా చూస్తూ ప్రక్కనే  కూర్చుని  పూజా ద్రవ్యాలతో  పూజారుల సహకారం తో అభిషేకం, పూజ చేసుకుని  తనివి తీరా నమస్కరించుకున్నాము. ఓంకారేశ్వర స్వామిని తాకటానికి వీలు లేదనేమో, మామలేశ్వర  స్వామిని తాకి, ఇంత తృప్తిగా సేవించుకోడానికి ఇక్కడ జ్యోతిర్లింగముగా  వెలిశారు. అక్కడినించి  మళ్ళీ ఓంకారేశ్వర స్వామి గుడి కి  వెళ్ళి మాతా పితలకు మనసారా మ్రొక్కి వచ్చాము. ఉదయం 9 : 30 కు  మహేశ్వరం  వెళ్ళే బస్సు  ఉండడం తో  ఓంకారేశ్వర  జ్యోతిర్లింగ  యాత్ర  ఇంత మహత్తరంగా జరిగేటట్లు చేసిన  ఆ  సర్వేశ్వరునికి మనసులోనే  ధన్యోస్మి  ఓం కారే అమరేశ్వరం మామలేశ్వరం. ఓం నమః శివాయ  హర  హర  మహాదేవ  అనుకుంటూ మహేశ్వరం  వెళ్ళటానికి  బస్సు దగ్గరకు వెళ్ళాము. తదుపరి  మహేశ్వర  యాత్రా  విశేషాలు చెప్పుకుందాము.
                                                        సర్వేజనా  సుఖినో  భవంతు.

     

bheema sankara jyotirlingamu in maharashtra




                                                        
ఓం  నమః శివాయ
                       నాకూ, మా బాబుకి శివ సుక్షేత్రాలు దర్శించడమంటే ఎంతో ఇష్టం. అత్యంత ప్రాముఖ్యం కలిగిన పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలలో పూణేకి దగ్గరలో ఉన్న భీమశంకర ధామం ఒకటి. ఆ శంకరుని అనుగ్రహం చేత ఒక వారాంతం అక్కడికి వెళ్దామని అనుకున్నాం. 11 / 2 / 2011  న  ముంబయ్ నుంచి భీమ శంకరం వెళ్ళడానికి MSRTC  బస్సు టికెట్ బుక్ చేశాము. ఘాట్కోపర్ లో రావలసినదానికన్నా ఒక గంట ఆలస్యంగా వచ్చింది బస్సు. కొంత దూరం పోయాక, బస్సు కిటికీ లో నుంచి చూస్తే, ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది. ఆ సౌందర్యాన్ని వీక్షిస్తూ మురిసిపోయాము. ఆహా ఏమి సోయగం! ఎటు చూసినా పచ్చదనం, చిన్న చెట్లకే  కాయలుకాసినవి. మామిడి చెట్లు అటు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా లేతగా, చిన్నగా ఉన్నా కూడా వాటికి నిండుగా పూత పూసి, ఎంత అందంగా ఉన్నాయో. అలాగే జామ చెట్లు కూడా అంతే. పంట పొలాలు అయితే  పచ్చని  ప్రకృతి  ఆకృతి  పార్వతి కాగా అన్నట్లు సస్య శ్యామలంగా అలరారుతూ ఉన్నాయి.
మేము అనుకున్నదాని కన్నా చాల ఎక్కువ సేపు పట్టింది భీమశంకరం చేరుకునే సరికి. దాదాపు రాత్రి 8 గంటలు అయింది. మేము వెళ్ళే సరికి గుడి తలుపులు వేసేస్తారేమోనని  త్వరగా బయలుదేరాము. బస్సు దిగిన దగ్గర నుంచి, గుడి దగ్గరకు వెళ్ళటానికి అరగంట పట్టింది. పెద్ద పెద్ద మెట్లు, కొండలు తొలిచి వేశారు. సాధారణంగా గుడికి వెళ్ళడానికి మెట్లు ఎక్కాల్సి వస్తుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే, గుడికి వెళ్ళడానికి మెట్లు దిగి వెళ్ళాలి. పరుగు లాంటి నడకతో గుడి దగ్గరకు చేరుకున్నాము. గుడి పక్కనే ఉన్న దుకాణం లో పూలు, కాయలు  తీసుకుని, పక్కనే ఉన్న కుండం లో కాళ్ళు కడుక్కుని  లోపలికి వెళ్ళాము. అక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా, నిజంగా దేవాలయం లాగా ఉంది. రణగొణ ధ్వనుల ఆచూకీయే లేదు. కనీసం జన సందోహాల కలకలాలు కూడా లేవు. అంతటి ప్రశస్తమైన ఆలయం ఇంత ప్రశాంతంగా ఉండడం ఆశ్చర్యంతో పాటు ఆసక్తిని, ఆనందాన్ని కలిగించింది. గర్భగుడిలో కేవలం నలుగురు ఆడ వారు, అర్చకులు ఉన్నారు. వారు అయ్యవారికి పూజ చేయించుకుంటున్నారు. మేమూ వెళ్ళి కూర్చున్నాము. అక్కడ గర్భగుడి లోకి వెళ్ళనిస్తారు. రాత్రి వేళ కావటం తో శివలింగానికి అలంకరణ తొడుగు పెట్టారు. పంచ ముఖాలతో అలరారుతూ ఎంత శోభాయమానంగా  ఉందంటే చెప్ప శక్యము కాదు. ఆ భీమేశ్వరుని చూస్తూ అలా తన్మయత్వం లో ఉండిపోయాము. ఈరాత్రికి దర్శనం అవుతుందో లేదో  అనుకున్న మేము ఇది అసలు ఊహించలేదు. కొన్ని ఆలయాలలో క్షణం పాటు దర్శనం కోసం గంటలు, రోజులు వేచియుండాల్సి వస్తున్నఈ రోజుల్లో, ఇంత ప్రశాంతంగా దగ్గరగా కూర్చుని పూజ చేసుకోవటం ఆ శివయ్యమాకు కల్గించిన అదృష్టమే కదా. ఎక్కువ జనం లేక పోవటంతో ఛాలా నెమ్మదిగా, ప్రశాంత చిత్తంతో పూజ చేసుకున్నాము. 

ఆ రాత్రి అక్కడే ఉండి, ఉదయం మళ్ళీ దర్శనం చేసుకుని వెళ్ళాలని మా ఆలోచన. గుడి దగ్గరలోనే రూం ఖాళీ ఉంటే తీసుకున్నాము. రూం కి వెళ్ళి, లగేజీ పెట్టి  అలా బయటికి వచ్చి వరండాలో నిలుచుంటే ఎదురుగా గుడి కన్పిస్తుంది. అలా చూస్తూ ఉంటే, ఆ అద్భుతమైన అనుభూతి ఎంతో మధురం. కానీ ఇంత దూరంలో కూడా కాకుండా, ఆ భీమ శంకరుని సన్నిధి లోనే ఉండగలిగితే బాగుంటుంది కదా అనిపించింది మా బాబుకి. గుడి ఆవరణలోనే  పడుకుంటే బాగుంటది కదా అన్నాడు బాబు. బలే ఆలోచన వచ్చిందే. ఆ శివయ్యని స్మరిస్తూ ఆయన నిలయంలో నిలవడం సుకృతమే కదా. విశాలంగా ఉన్న గుడి ఆవరణలో, గుడి లో పని చేసేవారు ఇద్దరు పడుకుని ఉన్నారు. మేము కూడా ఆ వైపు పడుకుంటాము అని వాళ్ళని అడిగాము. వాళ్ళు దానికి ఒప్పుకోలేదు, గుడికి సంబంధించిన వాళ్ళు తప్ప మిగిలిన వారు ప్రవేశించకూడదని అన్నారు. అయ్యో ఎలా అనుకుని కాసేపు అక్కడే ఉండి, మళ్ళీ ఒకసారి అడుగుదామనుకుని కొంచెం సేపే ఉండి వెళ్తాము అని చెప్పి ఎలాగో ఒప్పించాము. తర్వాత బాబు వాళ్ళ ద్వారా ఉదయం ఎప్పుడు తలుపులు తీస్తారో,  ఏవేళ అభిషేకం, పూజ చేస్తారో వివరాలు  అడిగి తెలుసుకున్నాడు. తెల్లవారు ఝామున 5  లోపే  అభిషేకం చేయించుకోవాలంట. ఆ తరువాత  శివ లింగం పైన పంచ ముఖాల తొడుగు పెట్టేస్తారంట. ఇంక మేము 2 గంటలు పడుకుని లేచాము  రూం కి వెళ్ళటానికి. చాలా సంతృప్తిగా అనిపించింది.


తెల్లవారుఝామున  4 గంటలకు మెలకువ వచ్చింది. అయిదు గంటల లోపే వెళ్ళాలి కదా ఎలా అనుకుని త్వరగా తయారయ్యాము. 5 గంటలు  కావస్తుంది. అప్పటికి ఇంకా పూజ సగమే అయింది. హమ్మయ్య అయిపోలేదు కదా అనుకుని హారతి ఇచ్చిందాకా బయటే ఉండి, హారతి తీసుకున్నాము. లోపలికి వెళ్ళవచ్చో  లేదో అనుకుంటూ ఉండగా  పూజారులే రమ్మని పిలిచారు. వెళ్ళి శివయ్యకి దగ్గరగా కూర్చున్నాము. ఎంత సంతోషమేసిందంటే  అసలు సాక్షాత్తూ అర్ధనారీశ్వరులే  కళ్ళ ముందు ప్రత్యక్ష మైనారా అన్పించింది. అక్కడ  శివ లింగం మధ్య లో పాపిటిలా ఉండి, రెండు లింగాల సంగమంలా ఉంటుంది. శివ పార్వతులు గా భావిస్తారు. శివలింగం యొక్క పానపట్టం లో ఉన్న చిన్న గుంట నుండి ఎప్పుడూ నీరు వస్తూ ఉంటుంది. ఆ నీరే భీమా నది. ఆ మహిమాన్విత శివ లింగం భీమేశ్వర జ్యోతిర్లింగం. పార్వతి అమ్మవారితో కలిసి వసించే అర్ధనారీశ్వరుడు, గంగా రూపిణి అయిన భీమాదేవిచే అనునిత్యం అభిషేకించబడే గంగాధరుడు. ప్రక్కనే కూర్చుని అభిషేకం, పూజ చేసుకున్నాము. గర్భాలయంలో ఉన్న అమ్మవారికి కూడా నమస్కరించుకుని, ఇంకా కొంత మంది పూజ చేసుకుంటుంటే చూస్తూ అక్కడే కూర్చున్నాము. ఎంత సేపు తాకి, నమస్కరించినా పూజారులు ఏమీ అనటం లేదు. తనివి తీరా మోటిచ్చుకుని నమస్కరించుకున్నాము. నిజంగా జన్మ ధన్యమయిందని చెప్పాలి. రాత్రి, ఇప్పుడు అలా దగ్గరే కూర్చుని పూజ చూసుకోవటం ఏ తపః ఫలమో. రాలేక రాలేక బయటికి వచ్చాము. అప్పుడు చూశాము అచ్చటి  ప్రకృతి శోభని.  చుట్టూ కొండశ్రేణులు, వాటి పైన దట్టంగా పచ్చని చెట్లమధ్యలో భీమశంకర  స్వామి గుడి. ఆ గౌరీశుడు  ఈ గిరుల  అందానికి  ముగ్ధుడై  ఇక్కడ  వెలశాడేమోఅనిపించింది.

గుడి దగ్గరనుంచి వచ్చి, రూం ఖాళీ చేసి  ఇల్లు కల వాళ్ళకు తాళం ఇవ్వటానికి  చూస్తే ఆ మామ్మ గారు లేరు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. కూర్చోండి వస్తుందని వాళ్ళ అబ్బాయి చెప్పాడు. అది చిన్న హోటల్ లాంటిది. వడా పావ్ అని  అక్కడ ఎక్కువగా తింటారు. అప్పటికి ఉదయం 9 దాటిందనుకుంటా ఆకలి మొదలైంది. ఏదో ఒకటిలే అని ఒక వడా  పావ్  తెప్పించుకుని తిన్నాము. ఏమిటి ఈ మామ్మ ఎక్కడికి వెళ్ళిందో ఇంకా రాదేమి అనుకుంటున్నాము. రూం అద్దె  డబ్బులు కుడా  ఇవ్వాలి కదా. ఇంతలో కాళ్ళకు చెప్పులు, స్వెట్టర్ వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని చాలా ఎత్తైన కొండ మీద నుంచి కర్ర పట్టుకుని  చేతిలో ఏవో పట్టుకొని, టక టక నడుచుకుంటూ వస్తుంది ముసలమ్మ. అహా ఈవిడా ముసలమ్మా. కానే కాదు. ఈ వయసులో పొద్దున్నే కొండ ఎక్కిదిగి వస్తుందంటే ఎంత ఓపికా. చూట్టానికి చాలా సన్నగా ఉంది. ఆమెను ఈ కాలం వాళ్ళ మనుషులతో పోల్చనే లేము. రూం అద్దె టిఫిన్ డబ్బులు కలిపి ఇచ్చాము. వస్తూ మరో సారి భీమ శంకర స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చేమెట్లు ఎక్కుతూ పక్కన ఉన్న షాపుల్లో ఏమి ఉన్నాయో చూస్తున్నాము. అయినా రాత్రి రుద్రాక్ష లు కొని శివయ్యదగ్గర ఉంచి పూజ చేసుకున్నాముగా. ఇంకా ఉదయం ఏమి ఉన్నాయో నని చూస్తుంటే శంఖువులు బాగున్నాయి. ఒక శంఖువు కొన్నాము. ఇంకా ముచ్చటగా ఉన్న నాలుగు చిన్న చిన్న శివయ్య ఫోటోలు  తీసుకున్నాము. అక్కడ పాలకోవా లాంటి స్వీట్ ఒకటి పెద్ద కళాయి లో చేస్తున్నారు. వాసన చూస్తుంటే తినాలని పించి కొంచెం తీసుకున్నాము. మెట్లు ఎక్కలేక ఎక్కుతున్నాను.  చాలా పెద్దవి, బాబు చెయ్యి పట్టుకుని మెల్లగా రామ్మా అని అంటున్నాడు. ఇంతలో ఒక షాపు వద్ద పొట్టిగా, సన్నగా ఉన్న చాలా ముసలావిడ వడా పావ్.. వడా పావ్ అని కేక లేస్తుంది. ఏమిటి ఇక్కడ ఈ వయసులో కూడా ఇలా పని చేస్తున్నారు అని మాకు ఆశ్చర్యమేసింది. సరే  చూద్దాము. ఇంతగా మామ్మగారు రమ్మంటున్నారు కదా అని లోపలికి వెళ్ళాము. వెళ్ళగానే వేడి  వేడిగా  వడా పావ్ చేసి ఇచ్చింది. చాలా బాగుంది. ఇంకోటి కావాలా అంటే సరే అన్నాము. మేము అడుగుతామని ముందే ఊహించినట్లు, రెండు నిమిషాల్లో  చేసి ఇచ్చింది. బలే హుషారైన మామ్మ గారు అని నవ్వుకున్నాము. దారి మధ్యలో స్కూలు పిల్లలని తీసుకుని టీచర్లు గుడి దగ్గరకు వెళ్తున్నారు. చాలామంది పిల్లలు ఉన్నారు. ఇంకా పది మంది కుర్రాళ్ళు తెలుగు లో జోక్స్ వేసుకుంటూ వెళ్తున్నారు. నాకు తెలుగు వాళ్ళని చూస్తే సంతోషంగా ఉంటుంది. నానీ తెలుగు వాళ్ళు అంటూ మా బాబుకి చెప్పాను. దారిలో రాజరాజేశ్వరీ అమ్మవారి గుడి ఉంది. అమ్మవారు చాలా ప్రసన్నం గా కొలువై ఉన్నారు. దేవికి నమస్కరించుకుని బస్సు దగ్గరకు చేరుకున్నాము. అప్పటికి మధ్యాహ్నం 12 అయింది. మధ్యలో బస్సు ఆగినప్పుడు తిన్నాము. ముంబయ్ చేరేసరికి  రాత్రి 11  అయింది. భీమ శంకర యాత్ర ఇంత సంతోషంగా జరిగినందుకు  ఆ మహాదేవునికి మనసులోనే  ధన్యోస్మి అనుకుంటూ విశ్రాంతి తీసుకున్నాము. తదుపరి మధ్య ప్రదేశ్ లోని  ఉజ్జయిని, ఓంకారేశ్వరం మరియు మహేశ్వరం యాత్రా  విశేషాలు  చెప్పుకుందాము.
                                                                శుభం భవతు .

Sunday, 6 November 2011

trayambakesvara jyotirlingamu in maharashtra

                                                                      
ఓం నమః శివాయ సర్వం శివ మయo. నేను, మా బాబు నాని మొదటిగా బెంగుళూరు లోని బడా గణపతి మందిరం కు వెళ్ళాము. అక్కడ గణపతి విగ్రహం చాలా పెద్దగా దాదాపు 8 అడుగులు ఎత్తు గా కొలువు తీరి ఉంది. ఆ మహా గణపతికి మనసారా నమస్కరించుకుని, దగ్గర్లోనే ఉన్న బడా నంది విగ్రహం కూడా చూద్దామని వెళ్ళాము. అక్కడ నందీశ్వరుడు  కూడా చాలా పెద్దగా ఉన్నాడు. ఆ నంది పైన శివ పార్వతులు చూడ ముచ్చటగా కొలువుతీరి ఉన్నారు. 
మేము బెంగుళూరు నుంచి ముంబై చేరుకున్నాము. మా బాబు ఉద్యోగ రీత్యా ముంబైలో నివాసం ఉంటున్నాడు.

                       త్రయంబకం 

28 -1 - 2011 న ముంబై నుంచి మహారాష్ట్ర లోని త్రయంబకేశ్వర స్వామి గుడికి బయల్దేరాము. నాసిక్ వరకు రైలు లో ప్రయాణం చేశాము. అక్కడ నుంచి కొంత దూరం బస్సులో, ఆ తర్వాత ఆటోలో గంట వరకూ ప్రయాణించిన తర్వాత సోమేశ్వర స్వామి గుడికి చేరుకున్నాము. అది జనవరి నెల అయినా కూడా ఉదయం 10  గంటలకే ఎండ ఎక్కువగానే ఉన్నట్లుగా ఉంది. కానీ అక్కడ ఇరు వైపులా చెట్లు ఉండి , దానికి తోడు మాకు ఆ శివయ్యని చూడాలనే ఆత్రుత వలన ఎండే తెలీలేదు.

అదిగో వచ్చేశాం, ఆ మహాదేవుని సన్నిధికి చేరుకున్నాం.
అక్కడ సోమేశ్వర స్వామి గుడికి తూర్పుగా పుణ్య
గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. ఆ పవిత్ర గోదావరిని సమీపించి, ఆమెకు ప్రణమిల్లి, ఆ పవిత్ర జలాన్ని శిరసున చల్లుకొని, కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాము.గోదావరి నీరు చాలా స్వచ్చంగా నిర్మలంగా ఉన్నాయి. అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. పక్కన పనస చెట్లు పెద్దవి,చిన్నవి కాయలు కూడా ఉన్నాయి.నేను అదే మొదటిగా ఆ చెట్లు చూడటం ,చాలా హ్యాపీగా ఉంది.మా బాబు ఐ .యస్ . ఐ (కలకత్తా ) లో చదివేటప్పుడు అక్కడ చాలా ఉన్నాయని చెప్పాడు. ఇంక గుడికి వెళ్ళాము. అక్కడ సోమేశ్వర స్వామి ధవళ వర్ణముతో లింగరూపంలో దేదీప్య మానంగా దర్సన మిస్తున్నట్లుంది చూట్టానికి రెండు కళ్ళు చాలవని పించింది .వర్ణించలేము చక్కగా మేమిద్దరం శివ లింగo ప్రక్కనే కుర్చుని స్వయంగా పూజ చేసుకున్నాము.మహారాష్ట్ర లో నాకు చాలా,చాలా నచ్చింది ఏమిటంటే మనమే గర్భ గుడి లోకి వెళ్ళి ,పూజ చేసుకోవటం. అక్కడ ఏ శివాలయం కి వెళ్ళినా, పూజారి బయట కూర్చుని ఉంటారు ,మనం లోపలికి వెళ్ళి, తాకి పూజ చేసుకోవచ్చు, ఎంత సేపు ఉన్నాఏమీ అనరు. గుడిలోకి మరాఠీ వాళ్ళు వచ్చి ,ధ్యానించుకుని వెళ్తున్నారు. మాకు అక్కడినుంచి కదలాలని ఉంటేగా. కానీ త్రయంబకం  వెళ్ళాలి కాబట్టి, ఆ  సోమేశ్వర మహాదేవునికి మరోసారి మనసారా నమస్కరించి, బయటికి వచ్చాము. ఆ ప్రశాంత వాతావరణం, ఆ సోమేశ్వర స్వామి దివ్య మంగళ రూపం మా మదిలో ఎప్పటికీ నిలిచితీరుతాయి.

అక్కడినించి త్రయంబకేశ్వరం బయలుదేరాం. బస్టాండ్ వరకు అటుగా వెళ్తున్న టాక్సీ మాట్లాడుకుని, త్రయంబకం వెళ్ళే బస్సు ల వద్దకు చేరుకున్నాము. ఆరోజు మరాఠీ వాళ్ళకు ఏదో విశేషమైన  పండుగట. ఏ బస్సు చూసినా విపరీతమైన రద్దీ. మేము ఆ జనం లో ఎక్క లేక రెండు బస్సులు ఎక్కకుండా  ఆగాము. అయినా ప్రతి ఒక్క బస్సు అలానే ఒత్తిడి గానే ఉంది. ఇంక ఎలాగో కష్టపడి, ఎక్కాము. కానీ నేను ముందు, మా బాబు చాలా చివర్న ఉన్నాము. ఎలా అక్కడేమో మరాఠీ,హిందీ నే మాట్లాడుతారు. నాకు హిందీ కొంచెమే వచ్చు. మా బాబు హిందీ,ఇంగ్లీష్ బాగా మాట్లాడుతాడు, బెంగాళీ కూడా తెల్సు .ఇప్పుడు చెరొక చోట ఉన్నాము. నాకన్నా ముందు బాబు కే కంగారుగా ఉంది, అమ్మ ఒక్కతే ఉంది, ఎలా అని. నేనేమో, నానీ ..నానీ అని పిలుస్తుంటే అందరూ నవ్వుతున్నారు. మొదట అర్ధం కాలేదు ఎందుకు నవ్వుతున్నారో తర్వాత వెలిగింది, హిందీ లో నానీ అంటే అమ్మమ్మ కదా అని. మాకూ నవ్వు వచ్చింది.  కొద్ది సేపటి తర్వాత ఎలాగో ఇద్దరం ఒకేచోటుకు వచ్చాము. బస్సు లో ఎవరో చెప్పారంట బాబు తో ఈరోజు దర్శనం అవుతుందో, లేదో అని. ఎటు చూసినా జనం. బస్సు లో నే కాదు, వాళ్ళు చాలాదూరం నుంచి, కాలినడకన, పాటలు పాడుకుంటూ, భజనలు చేసుకుంటూ,ఒక పల్లకి లో శివుని ప్రతిమ ఉంచి, ఆ పల్లకిని   తల మీద పెట్టుకు ప్రసాదాలు చేసుకుని, బస్సు రూటు లోనే త్రయంబకం వెళ్తున్నారు. ఆ జన ప్రవాహానికి బస్సు నెమ్మదిగా వెళ్తుంది, అప్పుడు, కిటికీ లో నుంచి మాకు ప్రసాదం పెట్టారు. మా మనసులో ఒకటే ధ్యాస. ఈరోజు దర్సనం అయితే బాగుండు నని. త్రయంబకం వచ్చేసింది. బస్సు దిగాము. గుడికి కొంచెం దూరం లో హోటల్ లో  రూం తీసుకున్నాము.దారిలో కొందరిని అడుగగా..వారు ఈరోజే దర్శనం కావడానికి అవకాశం ఉంది, రేపు అస్సలు గుడిలోకి వెళ్ళటానికి ఖాళీ ఉండదు అన్నారు.అప్పటికి సాయంత్రం 4 యింది. మేము రూం లో ఒక అర్ధ గంట రెస్ట్ తీసుకుని, బట్టలు,పూజ సామాగ్రి తీసుకుని. అక్కడి పుణ్య గౌతమీ  తటి లో స్నానం చేయడానికి బయలుదేరాము. మరాఠీ భక్తులు  పెద్ద, పెద్ద వంట సామగ్రి తో,లారీ లలో వచ్చి, ఆ రాత్రి  అక్కడి ఖాళీ ప్రదేశాలలో డేరాల్లంటివి  వేసుకుని, అందులో చిన్నా, పెద్దా అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. మరుసటిరోజు వారంతా దర్శనం చేసుకుని, తెచ్చుకున్న సామగ్రి  లో  వంటచేసుకుని, తిని, తిరుగు ప్రయాణం చేస్తారనుకుంటా.

మేము త్వరగా స్నానం చేయుటకు గౌతమ మహర్షి శివునికి తపస్సు చేసి, శివుడు అనుగ్రహించగా ఏర్పడిన మహిమాన్విత  గౌతమీ తటి వద్దకు వెళ్లి, స్నానం చేసి, అక్కడ ఉన్న విఘ్నేశ్వరునికి నమస్కరించి, ప్రక్కనే ఉన్న
గంగా మాత కు ప్రణమిల్లి, వడి వడి గా  త్రిమూర్తి  స్వరూపు డైన  త్రయంకేశ్వర  స్వామిని  వీక్షించ డానికి అత్యంత
ఆత్రుత తో వెళ్తూ,  దారిలో పూలూ, ప్రసాదాలు కొని, వెళ్ళి క్యూ లో నుంచున్నాము. చాలా పెద్ద క్యూ ఉంది.
మేము క్యూ వైపు చూస్తూ చాలా సమయం పడుతుందనుకు oటూ అలా రెండు నిముషాలు నుంచున్నాము. ఇంతలో 4 ,5 గురు మా దగ్గరకు వచ్చారు.  వంద,  రెండు వందలు ఇస్తే డైరెక్ట్  గా లోపలికి వెళ్ళేటట్లు చేస్తామని అన్నారు. అంత మంది జనం క్యూ లో ఉండగా వీళ్ళు ఎలా తీసుకు వెళతారు.. అయినా క్యూ లో నుంచుని వెళితేనే భగవంతుని కోసం  మనం వేచి ఉన్నట్లు. అనుకుని, మేము వరుస లో నుంచున్నాము. అప్పటికి 5:30 దాటింది.ప్రదోష సమయం సమీపిస్తుంది. ఈశ్వరుడు తాండవ మాడే సమయం. ఆ సమయం లో దర్శనం జరగటం..  శివానుగ్రహమే  కదా. అనుకుని, పాటలు పాడుకుంటూ వరుస లో నుంచున్నాము.


ఎదురుగా ఆ త్ర్యంబకేశుడు కొలువు తీరియున్న గుడి, ధ్వజ స్తంభం, విశాలమైన కొండ శ్రేణులు. చిత్రకారుడు గీసినట్లు కొండలు వరుసగా ఎత్తు, పల్లం గా ఎంతో అందంగా ఉన్నాయి. అప్పుడే భానుడు తల్లి ఒడిలోకి కొండల  క్రిందుగా  దిగుతూ  వెళ్తున్నాడు. ఆ సంధ్యా కిరణాలు  గుడి  పైన, కొండల మీద పడ్తున్నాయి. ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉందో అది వర్ణనాతీతం. అద్భుతం, అమోఘం. అంత సుందర దృశ్యం తన కెమెరాలో బంధించకుండా ఉంటాడా మా బాబు.  ఆ వచ్చేస్తున్నాం.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయ్యవారి దర్శన భాగ్యం మరి కొద్ది క్షణాల్లో  కలగబోతుంది. లైన్ జరుగుతుంది..
మా మది లో అనిర్వచనీయమైన ఆనందం. ఎదురుగా టీవీ లో,  గుడిలో పూజాదికాలు చేయటం చూపిసున్నారు. అవి చూస్తూ వెళ్తున్నాము. మెల్లగా ధ్వజస్తంభం దాటాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్రక్కన వినాయకస్వామి, ఆ స్వామికి నమస్కరించి, ముందుకు కదిలాము. లోపలికి  వచ్చేశాం. కొంచెం అలా..అలా ముందుకు వెళ్తూ ఆ ఆది  దేవుడు, సృష్టి,స్థితి,లయ కారకుడైన త్రిమూర్తి రూపుని చూడాలని, చూపంతా అటే ఉంచాము.ఆ.. వచ్చేశాం.  ఎదురుగా ఒకే పానపట్టం లో ముమ్మూర్తులా మూడు శివ లింగాలు. తన్మయత్వం తో మది ఉప్పొంగగా, తనివితీరా ఆ మహాదేవునికి భక్తి పారవశ్యం తో నమస్కరించుకున్నాము.






అప్పటికి రాత్రి 8  30 కావటం వలన భోజనం చేద్దామని దగ్గరలోని హోటల్ కు వెళ్ళాము. ఆర్డర్ చెప్పిన కాసేపటికి కాసేపటికి భోజనం తీసుకువచ్చారు. కొంచెం వరి అన్నం, రెండు మైదా పిండి రోటీలు. పాలక్ పన్నీర్, ఆలూ కర్రీ ఇంకా గుర్తులేదు మొత్తానికి ఎలాగో తిన్నాము. అక్కడ రోటీలే ఎక్కువ. ఆంధ్రా వాళ్లకు వారు పెట్టే గుప్పెడు మెతుకులు పిల్లలకు కూడా చాలవు.హోటల్ నించి మేముండే హోటల్ రూం కి వెళ్ళాము. ఊటీ లో ఎంత చలో తెలీదు కానీ అక్కడ ఉన్న చలికి మాత్రం దుప్పట్లు, పరుపులు మంచు ముద్దల్లా ఉన్నాయి. చేతులు,కాళ్ళు చల్లగా మొద్దుబారి పోయాయి. అంత చలికి నిద్ర ఎలా పడ్తుంది. ఏదో కాసేపు అలా అలసిన శరీరానికి విశ్రాంతినిచ్చి, తెల్లవారుఝామున 4 గంటలకే లేచి,ఆ చలిలోనే బస్టాండ్ కి వెళ్ళాము. మరోసారి ఆ త్రయంబకేశ్వర  స్వామిని మనసులో స్మరించుకుని షిరిడీ వెళ్ళటానికి,షిరిడీ వెళ్ళే బస్సు ఎక్కాము. చలికి మా పెదాలు పగిలి మాట్లాడటానికి కూడా చాలా కష్టంగా ఉంది .షిరిడీ వెళ్ళి, అక్కడినించి శనీశ్వరుదు స్వయంగా వెలసిన శని సింగణాపూర్ వెళ్ళి అక్కడినించి ముంబయ్ వెళ్దాం  అనుకున్నాము. కానీ సమయం ఎక్కువ లేదు. షిరిడీ లో బస్సు దిగిన వెంటనే సామానులు, పూలు,కొబ్బరికాయలు కొన్నషాపు లో ఉంచి, బాబా దర్సనం కోసం బయల్దేరాము. జనం బాగా ఎక్కువే ఉన్నారు. అయినా పర్లేదు వరుస  చక్కగా కదులుతుంది.మేము చాలా వేగంగా నడుస్తూ వెళ్ళి, వరుసలో నుంచున్నాము.అక్కడ వాతావరణం చాలా  ప్రశాంతంగా ఉంది. అడుగడుగునా గాలి పంకాలు, మంచినీళ్ళు, కూర్చుంటానికి బల్లలు బారుగా ఉన్నాయి. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా అన్ని వసతులూ ఉన్నాయి. అలా జరుగుతూ ఆ బాబాకి దగ్గరవుతూ ఉన్నాము. మాకు ముందు నుంచున్న వారిలో ఒక చిన్ని బాబు వాళ్ళ అమ్మ భుజం  ఫై ఉండి మా వైపు అలానే  చూస్తూ ఉన్నాడు. చాలా  ముద్దొస్తున్నాడు. ఆ బాబు అలా అమాయకంగా చూస్తుంటే నేను రమ్మన్నట్లు సైగ చేస్తూ నవ్వాను. బాబు మొదట అలానే చూసి, వేరొక వైపు తిరిగాడు. కొంచెం సేపటికి మళ్ళీ ఇటు తిరిగాడు. నేను మళ్ళీ అలానే చెయ్యి ఊపుతూ నవ్వాను. ఈసారి బాబు కుడా నవ్వాడు. నేను చూడమని మా నానీకి చెప్పాను. అలా మా ఇద్దరి వంక బుల్లి బాబు నవ్వుతూ చూస్తూ, మధ్యలో మేము కనిపించక పొతే వెతుక్కుంటున్నాడు. ఆ పసివాడిని చూస్తుంటే చాలా ముచ్చటేసింది. ఈ సందట్లో బాబా దగ్గరకు వచ్చేశాము. బాబా పాలరాతి విగ్రహం. ఒక కాలు మడిచి, ఇంకొకటి దానిపైన పెట్టుకుని  అభయ హస్తం తో చిరునవ్వు చిందిస్తూ  ఉన్నారు. శాంతి స్వరూపుడైన బాబా దర్శనంతో మనసు ప్రశాంతతని పొందింది. మనసారా నమస్కరించుకుని, తెచ్చిన పూలూ, ప్రసాదం సమర్పించుకుని వెలుపలికి వచ్చాము.

అక్కడినించి సింగ ణాపూర్ వెళ్ళే వాహనాలు ఎక్కువగా నిండిపోయి ఉన్నాయి. మేము కొంచెం ఆగితే ఉంటాయనుకుని చూస్తూ ఉండగా ఒక వాన్ లో ఖాళీ ఉంటే అందులో ఎక్కాము. సింగణాపూర్ లో ఒక విశేషముంది. ఏమంటే ఆ ఉరిలో ఇళ్లకు తలుపులు ఉండవు. మేము వాన్ లో వెళ్తూ చూశాము, ఇళ్ళకు, బళ్ళకే కాదు దుకాణాలకి కూడా తలుపులు లేవు. ఆ మహా శక్తివంతుడైన శనీశ్వరుడే వాళ్ళని, వాళ్ళ వస్తువులని కాపాడతాడని వారి నమ్మకం. వాన్ గుడికి కొంచెం దగ్గరలో ఆగింది. అక్కడ మగవారు మాత్రమే దగ్గరగా వెళ్ళి, నువ్వుల నూనె తో అభిషేకం చేసుకోవచ్చు. ఆడవారు కొంచెం ఎడం గా వేరే వరుస లో వెళ్ళి దండం పెట్టుకుంటారు. మా బాబు అలా స్నానం చేసి ఎర్రటి ధోవతి (అక్కడ కొనుక్కోవాలి లేదా పూజ సామాగ్రీ కొన్న దుకాణాల వాళ్ళు ఇస్తారు) కట్టుకుని, నువ్వుల నూనె తీసుకున్నాడు. నేను కూడా పూజ సామగ్రి తీసుకుని, చెరొక వరుస లో నుంచున్నాము. అక్కడ ఈశ్వరుని పేరు గల సూర్య పుత్రుదు, యమ సహోదరుడైన శనీశ్వరుడు గుడిలోపల కాకుండా, బయట కొలువు తీరియున్నాడు. ఎత్తుగా, కొంచెం ఏటవాలుగా నిగనిగలాడే ఒక నల్లని శిలా ఫలకం, ఆయనే స్వయంభువుడు, ఆశుభాపహారి అయిన శనీశ్వరుడు. తన్మయత్వం తో నమస్కరించుకున్నాము. మా బాబు నూనెతో అభిషేకించిన తర్వాత ధోవతి మార్చుకుని,  ప్రసాదం తీసుకుని, వచ్చి వాన్ లో కూర్చున్నాము. అప్పటికే మిగతా వాళ్ళు వచ్చేశారు.అక్కడి నించి వస్తూ ఉండగా మధ్యలో  తెలుగు వాళ్ళు వాన్ లో ఎక్కారు. వాళ్ళతో కాసేపు ముచ్చట్లు. మీది తెలుగు మాది తెలుగు లాగా. ఇక షిరిడీ లో దిగి, ముంబయ్ కి బుక్ చేసుకున్న బస్సు ఆగే దగ్గరకు వెళ్ళాము. అయిదు నిమిషాల్లో బస్సు వచ్చేసింది. అమ్మో కొంచెం ఆలస్య మైతే బస్సు వెళ్ళిపోయేది అనుకుని బస్సు ఎక్కాము. హమ్మయ్య భగవంతుని  దయతో మా పుణ్య యాత్ర సదా క్షేమంగా. శుభప్రదంగా జరిగినందుకు ఆ జగదీశ్వరుడు త్రయంబకేశ్వరునకు, శుభంకరుడు శనీశ్వరునికి, సద్గురు సాయినాథునికి మనసులో కృతఙ్ఞతలు తెలుపుకుని ధన్యోస్మి అనుకున్నాము. సంతోషంగా ఇద్దరం సీటు లో నిద్రకు ఉపక్రమించాం. రాత్రి 1 30  కి  క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. తదుపరి భీమశంకర  యాత్రలోని విశేషాలు  చెప్పుకుందాము.
                                                        సర్వేజనా  సుఖినో  భవంతు.