శ్రీ శైల లింగం శిరసా నమామి..మల్లికార్జున రూపం మనసా స్మరామి..
శ్రీ శైల స్థల వాసినీం భగవతీం శ్రీ మాతరం భావయే..
నమో శ్రీ శైల వాసా..భ్రమరాంబికా మనోహరా హర హర మహాదేవా అనుకుంటూ శ్రీ శైల యాత్రకు గత 8
సంవత్స రాలుగా కుటుంబ సమేతంగా ఆ శ్రీ శైల మల్లికార్జున స్వామిని భ్రమరాంబికా అమ్మ వారిని సందర్సించుకొనే భాగ్యం ఆ పరమేశ్వరుని దయ వలన మాకు కులుగుతూ ఉంది. ఆ స్వామి చల్లని చూపులు మాయందు నిరంతరమూ నిలిచి ఉండాలని కోరుకుంటూ..శ్రీ శైల యాత్రా విశేషాలు చెప్పుకుందాము..ఎంత చెప్పినా
తక్కువే.. పూర్తిగా చెప్పటము సామాన్య మానవులకు సాధ్యం కాదేమో..అంతటి మహిమాన్విత క్షేత్రము శ్రీ శైలము.
కైలాసం లో పార్వతీ పరమేశ్వరులు కుటుంబ సమేతంగా కొలువు తీరి ఉండగా..పిల్లలిద్దరూ తల్లి దండ్రు లను మారాం
చేస్తూ మాలో తొలి పూజ ఎవరికి అని అడుగగా అంత మహేశ్వరుడు మీలో ముందుగా ఎవరు మూడు లోకాలలోని
పుణ్య తీర్ధాలలో స్నానం చేసి వస్తారో వారే తొలి పూజకు అర్హులు అని చెప్పగానే షణ్ముఖ స్వామి తన మయూర
వాహనం ఎక్కి రివ్వున బయలుదేరి వెళ్ళగా వినాయక స్వామి తన మూషిక వాహనం ఎక్కి వెళ్ళలేక తండ్రితో
జనకా.. మీకు సర్వం తెలిసీ ఇలాంటి పరీక్ష పెట్టటం భావ్యమా అని అడుగగా.. పుత్రా ఈ ప్రపంచం లో వేటికీ సరితూగలేని దైవం ఎవరూ.. అని చిరునవ్వు చిందిస్తూ పుత్రుని వంక చూడగానే గణపతి స్వామికి వెంటనే ఏదో స్ఫురించినట్లు తల్లి దండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయగానే.. అక్కడ షణ్ముఖ స్వామికి తను స్నానం చేయుటకు వెళ్తున్న
ప్రతి సారీ అంతకు ముందే గణపతి స్వామి ఆ నదిలో స్నానం చేసి వస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. కైలాసంలో
ఆది దంపతులు గణేష్ స్వామికి ఆధి పత్యమునొసగి సిద్ధి, బుద్ధి ల తో వివాహము చేసి ముదముతో యుండగా త్రిలోక నదీ సంచారానికి వెళ్ళిన కుమారస్వామి అరుదెంచి విషయము గ్రహించి.. అలిగి నల్లమల అడవులలో తపస్సుకై వెడలగా పుత్ర వాత్సల్యముతో పుత్రుని వెతుకుతూ పార్వతీ దేవి శ్రీ శైలం రాగా భార్యా బిడ్డలున్న శ్రీగిరి
శిఖరము కడకు సిరులిచ్చే మల్లన్నే స్వయంగా తరలి రాగా..దేవతలందరూ ఆ ఆది దంపతులను కీర్తిస్తూ మీరు
ఇక్కడే వెలసి మమ్ములను సదా కాపాడ వలసిందని సదాశివుని కోరగా అంత ఆ బోళాశంకరుడు దయార్ద్ర హృదయుడై ఇక్కడే జ్యోతిర్లింగముగా వెలసి భక్తుల మొరలాలకిస్తున్నారు. పార్వతీ దేవి భ్రమరాంబికగా అయ్యవారి ప్రక్కనే శక్తి పీఠము గా అవతరించిన ప్రసిద్ధ పుణ్య క్షేత్రమే శ్రీ శైలము. దేశం నలుమూలల నుండి నిరంతరం భక్తులు
వస్తూనే ఉండడం తో ఎల్లప్పుడూ వరుసలలో భక్తులు క్రిక్కిరిసి ఉంటారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందు కర్నూలు జిల్లా లో ఉన్న ఈ పుణ్య క్షేత్రం ఎల్ల వేళలా హర హర మహాదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారు మ్రోగుతూ ఉంటుంది. పరమేశ్వరుని పవిత్ర జ్యోతిర్లింగము అమ్మవారి శక్తి పీఠము రెండూ ఒకే చోట గల ఈ దివ్య ధామం అశేష జన వాహిని తో , మాలధారణ పొందిన భక్తులతో నిత్యం కళ కళ లాడుతూ ఉంటుంది.
మహా శివరాత్రికి, కార్తీక మాసంలో జన ప్రవాహము విపరీతంగా ఉండుటచే మిగిలిన రోజుల్లో వీలు చూసుకుని ,
వెళ్ళి వస్తూ ఉన్నాము. ఆగష్టు 4 రాత్రి గుంటూరు లో 10 : 30 కు బస్సు ఎక్కితే దోర్నాల వెళ్ళేసరికి తెల్లవారుఝాము 4 అవటంతో బస్సు అక్కడే నిలిపివేసి (అక్కడినుండి అడవి ప్రాంతం కావటంతో రాత్రి వేళల్లో ఎటువంటి వాహనములు వెళ్ళనివ్వరు.) ఉదయం 5 : 30 కు తిరుగు ప్రయాణం సాగింది. కిటికీ ప్రక్కనే కూర్చుని దట్టమైన నల్లమల అడవులను చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. బస్సు ఒకోసారి కిందకు మళ్ళీ పైకి అలా వెళ్తుంటే ఊయల ఊగినట్లు బలే బాగుంది. ఆ రూటంతా పెద్ద పెద్ద కొండలు తొలిచి రోడ్డు వేశారు. ఎత్తైన కొండ ఎక్కి వెళ్తుంటే ప్రక్కన చూస్తే ఎంత ఎత్తులో ఉన్నామో అనిపిస్తుంది.మొత్తానికి దోర్నాల నుండి శ్రీ శైలం వరకు బస్సు లో మేము చాలా హుషారుగా ఉంటాము. శ్రీ శైలం లో బస్సు దిగి సత్రం లో రూం తీసుకుని పాతాళగంగ లో స్నానానికి బయలుదేరాము. చాలా పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి. ఎలా వేసారో ఇంత పెద్ద మెట్లు నాకు కొన్ని మెట్లు దిగేసరికే కాళ్ళు నొప్పులు పుడుతుంటే మా బాబు చెయ్యి పట్టుకుని మెల్లగా తీసుకెళ్తున్నాడు. చూస్తుంటే చాలా దగ్గరే నీళ్ళు ఉన్నట్లు కనిపిస్తుంటుంది కానీ చాలా మెట్లు ఉన్నాయి.అలా మెల్లగా దిగుతూ ఆ గంగమ్మ తల్లి దగ్గరికి చేరుకున్నాము. శ్రీ శైలం చాలా ఎత్తులో ఉంటుంది కదా కృష్ణానది ప్రవహిస్తూ ఇక్కడకు చేరుకొని చాలా లోతుగా ప్రవహిస్తూ పాతాళగంగ గా పిలువబడుతుంది. ఇందులో నీళ్ళు ఆకు పచ్చగా ఉంటాయి. ఆ పవిత్ర గంగా భవానీ మాతకు నమస్కరించి స్నానం చేసి ప్రక్కన ఉన్న గదులలోనికి వెళ్ళి పొడి బట్టలు కట్టుకుని వచ్చి మెట్లు ఎక్కే దారిలో చాలా చిన్న చిన్న శివ లింగాలు, శివయ్య ఫోటోలు ఉండి వచ్చిన భక్తులు పూజ చేసుకుని వెళ్తున్నారు.
మేము కూడా ఆ అర్ధనారీశ్వరునికి పూజ చేసుకుని గంగా భవానీ తల్లికి నమస్కరించుకుని వచ్చిన దారినే మెట్లు ఎక్కుతూ కొంత సేపటికి మల్లికార్జున స్వామి దర్సనం కొరకు టికెట్ తీసుకుని వరుసలో నుంచున్నాము. వరుస
చాలా పొడవుగానే ఉంది. భక్తులు ఎల్లవేళలా ఆ శివయ్య దివ్య దర్సనం కొరకు వేచి ఉండడం లో ఆశ్చర్యమేముంది
అనుకుంటూ ఆ మహాదేవుని తలుచుకుంటూ అలనాటి రాజులు ఎందరో శ్రీ శైలం వచ్చి శివయ్యని సేవించుకున్నట్లు
శివాజీ, విజయనగర రాజులు శ్రీ శైల క్షేత్రము నకు అభేజ్యమైన ఎత్తైన ప్రాకారాలను, అపూర్వ శిల్ప కళా సంపదను
సమకూర్చి ఆ మహాదేవుని కృపకు పాత్రులైనట్లు, శివాజీ మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడే కొంతకాలం నివాసముండి
ఆ ఆదిదంపతులను సేవించి భ్రమరాంబికా అమ్మదయతో ఆ భవానీ మాత నుంచి దివ్య ఖడ్గము అందుకున్నట్లు గా
శ్రీ కృష్ణ దేవరాయలు శ్రీ శైలం కు వచ్చిన భక్తుల వసతికి కట్టించిన ఎన్నో సత్రాలు, ఆ దేవ దేవునికి ఆయన ఎన్నో సేవలు చేసి ఆ పరమే శ్వరుని కరుణా కటాక్షం పొందినట్లు చరిత్రలో మనం చదువుకున్నవి మదిలో మెదిలినాయి. గుడి చుట్టూ ఉన్నఆ ప్రాకారాలు, వాటిపైన శ్రీ శైల క్షేత్ర మహిమను, స్థల పురాణం తెలిపే చిత్రాలు చెక్కిన తీరు అద్భుతం. అవి చూస్తూ ఉండగా వరుస మెల్లగా కదులుతూ మల్లన్న కు చేరువవుతూ ఉంటుంటే చెప్పలేని ఆనందం కలుగుతుంది మా మది లో. ఎత్తైన గాలి గోపురం దాటి లోపలి కి అడుగుపెట్టాము. అక్కడ అతి పెద్ద నందీశ్వరుడు, ముందు శివ పార్వతుల చిన్న ప్రతిమలు ఉన్నాయి. భక్తులు తీసుకెళ్ళిన కొబ్బరికాయలు అక్కడే స్వామికి నివేదం చేసి ఇస్తున్నారు.స్వామికి పూలు,కొబ్బరికాయలు ఇచ్చి,ముందుకు కదిలాము. ఆ స్తంభాలు వాటిపైన చెక్కిన అద్భుత శిల్ప కళా నైపుణ్యం చూపరులను ఆశ్చర్యానందాలలో ముంచెత్తుతాయి. ఒక ప్రక్క వృద్ధ మల్లికార్జున స్వామి గుడి కనిపిస్తుంది. ఇంకో వైపు మనోహర కుండం అందులో ఎప్పుడూ నీరు నిలచి చాలా స్వచ్ఛంగా ఉంటుందంట. గుడి గోపురం పైన నాలుగు మూలలా నాలుగు మనోహరమైన నందీశ్వర ప్రతిమలు అవన్నీ చూస్తూ ఆ మల్లన్న స్వామిని చూడ బోతున్నామనే ఆనందం లో అలసటే తెలీలేదు. తదుపరి మళ్ళీ వరుస జరుగుతూ సింహ ద్వారం దాటంగానే అతి సుందరమైన చాలా పురాతనమైన నటరాజ స్వామి ప్రతిమ చూస్తుంటే హృదయం పులకించిపోయింది.మనసారా కళ్ళకు హత్తుకుని నమస్కరించుకుని మెల్లగా జగత్ పిత మల్లికార్జున స్వామి దగ్గరకు వచ్చాము. గర్భ గుడిలో మల్లన్న స్వామిని చూడగానే తన్మయత్వం తో సాక్షాత్తు ఆ కైలాస నాధుడే కనుల ముందు సాక్షాత్కరించినట్లు మా హృదయం పులకించిపోయింది. ఆ మహాదేవునికి మనసారా ప్రణమిల్లి తల మోటించుకుని చేతులతో తడుముకుని కళ్ళకద్దుకుని నమస్కరించుకుని రాలేక రాలేక అక్కడినుంచి వస్తూ పాండవులు ప్రతిష్ఠించినట్లు చెప్పబడిన అయిదు శివలింగాలు చూసి నమస్కరించుకుని ఇంకొంచెం ముందుకు వెళితే వీరభద్ర స్వామి గుడి. ఆ స్వామికి నమస్కరించుకుని వస్తూ తీర్ధం, ప్రసాదం తీసుకుని నేరుగా అమ్మ వారి దగ్గరకు వెళ్ళాము.దారిలో సహస్ర లింగేశ్వర స్వామి, ప్రక్కన అమ్మవారు ఉన్నచోట పూలు,కొబ్బరికాయలు ఇచ్చి ఆ తల్లి దగ్గరకు చేరుకున్నాము. అమ్మలగన్నయమ్మ ఆదిపరాశక్తి భ్రమరాంబికా దేవి ప్రసన్నవదనంతో మనోహరంగా చిరునవ్వులు చిందిస్తూ అభయహస్తంతో భక్తులను ఆశీర్వదిస్తున్నట్లుంది. చూడగానే హృదయం భక్తి భావనతో ఉప్పొంగి అమ్మకు శిరసు వంచి చేతులుజోడించి నమస్కరించి వెలుపలికి వస్తూ వాకిలి దగ్గర ప్రసాదం తీసుకుని రూం కి వస్తూ ఉంటే దారిలో ఇష్టకామేశ్వరీ అమ్మవారి దగ్గరకు వెళ్ళే వాన్ లు ఆగి ఉన్నాయి. మేము వెళ్ళి వివరాలు కనుక్కుని అప్పటికి మధ్యాహ్నం 12 దాటటంతో సాయంత్రం వెళ్దామని గుడి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మా బాబుకి భోజనం టికెట్లు ఇవ్వగా భోజన సత్రం ఎక్కడో తెలుసుకుని అక్కడికి వెళ్ళి స్వామి వారి దివ్య ప్రసాదం అన్నపూర్ణమ్మ తల్లి అందిస్తున్నట్లు కళ్ళకు అద్దుకుని సంతోషంగా తిని ఆ ఆది దంపతుల దయ వలన మాకు కలిగిన దానిలో కొంచెం విరాళ మిచ్చి అక్కడి నుండి రూం కి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుని 2 గంటలకు ఇష్ట కామేశ్వరీ అమ్మవారి దగ్గరకు వెళ్ళటానికి వాన్ దగ్గరకు వెళ్ళాము. 10 మంది వస్తేగాని వెళ్ళరంట. అప్పటికి 8 మంది అవగా ఇంకా ఇద్దరు కాసేపటికి వచ్చారు. వాన్ బయలుదేరి కాసేపటికి అడవిలోనికి ప్రవేశించింది. దారి అంతా ఎర్రని మట్టి రోడ్డు ఇరుకుగా గతుకులు గా ఉండి, వాన్ ఎత్తు పల్లాల మీద వెళ్తుంటే మాకు ఊయల ఊగుతున్న విధమై బలేగా ఉంది ఈ ప్రయాణం అనుకున్నాము. అలా ఒక గంట ప్రయాణం చేశాక వాన్ ఆగింది. అమ్మవారి దగ్గరకు వచ్చేశామనుకున్నాం కానీ అక్కడంతా రాళ్ళు ఎక్కువగా ఉన్నందు వలన వాన్ వెళ్ళదు నడచి వెళ్ళాలి అన్నారు. సరే అని దిగి నడక మొదలు పెట్టాము. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి చిన్న చిన్న గుడిసెలు కనిపించినవి. చూస్తూ వెళ్తుంటే కొండ రాళ్ళు పేర్చిన ఒక చిన్న సొరంగం కనిపించింది. ఆ సొరంగం లోనికి వెళ్తే అమ్మవారు ఉంటారని అక్కడున్నవారు చెప్పారు. గుహ దగ్గర కొంత మంది భక్తులు లోపలికి వెళ్ళి వస్తున్నారు. గుహ వెలుపల శివ లింగాలు, నందీశ్వరుడు ఉన్నాయి. గుహకి కొంచెం ఎడంగా కాలువ ఉండి అందులో నీరు ప్రవహిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి కాళ్ళు, చేతులు కడుక్కుని వచ్చాము. ఈలోపు గుహ దగ్గర ఖాళీగా ఉంటే శివయ్యకి, నందీశ్వరునికి నమస్కరించుకుని ఒకరి తర్వాత ఒకరుగా లోపలికి వెళ్ళాము. అక్కడ అంతా చీకటిగా ఉండి, కళ్ళు చీకటికి అలవాటు పడినాక అమ్మవారి ప్రతిమ మనోహరంగా ఉండి, చూడగానే తన్మయత్వం కలిగి మనసు పులకించింది. అమ్మవారి నుదుటి వద్ద మనం బొట్టు పెట్టి నమస్కరించుకుంటే మంచిదని చెప్పారు. మేము అమ్మవారికి పూజ చేసుకుని నుదుట బొట్టుపెట్టి మనస్పూర్తిగా నమస్కరించుకుని సంతోషంగా ఒకరి తదుపరి ఒకరం బయటికి వచ్చికాసేపు అక్కడే కూర్చుని వాన్ ఉన్న చోటికి వచ్చి వాన్ లో అప్పటికే మిగతావారు కూడా రావడంతో మేము కూర్చోగానే వాన్ లో తిరుగు పయనం సాగింది. ఇలాంటి ఊయల ఊగుతున్నట్లుగా ఉండే ప్రయాణమంటే చిన్న పిల్లలు బలే సరదా పడతారు అనుకున్నాము. వస్తుంటే గుహ దగ్గరకు వెళ్ళే వాన్లు 4 , 5 ఎదురైనవి. ఒక గంట ప్రయాణం చేయగా వాన్ ఎక్కిన చోటుకి చేరుకున్నాం. అప్పటికి సాయంత్రం 4 అవటంతో రూం కి వెళ్ళి 5 గంటలకి
మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా అమ్మవార్లకు ప్రత్యేక పూజ చేసుకోవటానికి టికెట్ల కోసం బాబు ముందు వెళ్ళి టికెట్లు తీసుకుని మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మేము వడి వడి గా వెళ్ళి పూజ చూసిన కాసేపటికి మహా హారతి తీసుకుని వరుసలో గర్భగుడి లోనికి వెళ్ళి, ఆ మహాదేవుని మనసారా చేతులతో తడుముకుని తల మోటించుకుని కళ్ళకద్దుకుని తన్మయత్వం తో హృదయం ఉప్పొంగగా ఆ మల్లన్నతండ్రి మమ్ములను సదా చల్లగా చూడాలని ఆ సదా శివుని కోరుకుంటూ మనస్పూర్తిగా నమస్కరించుకుని అక్కడినుంచి భ్రమరాంబిక అమ్మవారిదగ్గరకు వచ్చి ( క్రితం సారి వచ్చినపుడు అయ్యవారికి అభిషేకము, పూజ, అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్న వివరములను మనసున తలచి ముదమునొంది) ఆ శివాని తల్లి చల్లని చూపులు మాయందు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనస్పూర్తిగా ఆ భవానీ మాతకు నమస్కరించుకుని వెలుపలికి వస్తూ ప్రసాదం
తీసుకుని దారిలో షణ్ముఖ స్వామి ఎదురుగా శివలింగం అక్కడ పూజ చేసుకుని నమస్కరించుకుని వెలుపలికి వచ్చి అకడ ఉన్న గంగా మాత ఇంకా శివలింగాలు చూసి అక్కడ పూజ చేసి నమస్కరించుకుని అక్కమహాదేవి గుహలకు ఎప్పుడు ఎలా వెళ్ళాలో తెలుసుకోగా మధ్యాహ్నం 12 లోపే టికెట్ బుక్ చేసుకోవాలంట. చాలా దూరం బోటు లో ప్రయాణిస్తే ఆ గుహలు వస్తాయంట. ఇప్పుడు వీలుపడదనుకుని లోగడ వచ్చినప్పుడు బస్సు లో వెళ్ళి చూసిన సాక్షి గణపతి, ఫాలధార, పంచ ధార, ఆది శంకరా చార్యులు, హటకేశ్వరము, శిఖర దర్శనం అక్కడ ఉన్న సహస్ర శివ లింగాలు, లోపల శివయ్య గుడి, ఆ గుడి లోనికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడినుండి శ్రీ శైలం డ్యాం చూడటం అవన్నీ మదిలో మెదిలాయి. ఆ అనుభూతులు నెమరువేసుకుందాము. సాక్షి గణపతి గుడి లో వినాయక స్వామి చాలా మనోహరంగా ఉన్నారు. వెళ్ళిన వారు స్వామికి చెప్పుకోవాలంట మేము శ్రీ శైలం వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించు కున్నాము అందుకు నీవే సాక్షి అని. గణపతి స్వామికి చెప్పుకుని నమస్కరించుకుని అక్కడినుంచి ఫాల ధార అంటే శివుని ఫాల భాగము నుండి ఉద్భవించిన పవిత్రమైన నీరు. పంచ ధార అనగా శివుని 5 ముఖముల నుండి వెలువడిన దివ్య జలము. అక్కడికి వెళ్ళాలంటే ఆ ప్రదేశము చాలా లోతులో ఉంటుంది.. పెద్ద పెద్ద మెట్లు దిగాలి అలాగే మెల్లగా దిగుతూ చూస్తుంటే కనుచూపు మేర అంతటా పచ్చని చెట్లతో నిండి అద్భుతంగా ఉంది. నేను అంత పెద్ద మెట్లు దిగలేక పోతుంటే మా బాబు చేయి పట్టుకుని మెల్లగా నడిపించుకుంటూ చూడమ్మా ఈ అడవి లో ఇలాంటి అందమైన దృశ్యాలు ఉన్నాయో అని చెప్తూ ఫోటోలు తీస్తూ కాసేపటికి ఫాలధార, పంచ ధార ఉన్న ప్రాంతానికి చేరుకున్నాము. జగద్గురు ఆది శంకరా చార్యులవారు ఇక్కడే తపస్సు చేసుకున్నారంట. అమ్మవారి ప్రతిమ శంకరాచర్యుల ప్రతిమలు ఉన్నాయి నమస్కరించుకుని ఫాల ధార పంచ ధార ల వద్ద ఆ నీళ్ళు శిరస్సున చల్లుకుని కొంచెం త్రాగితే తీయగా చాలా బాగున్నాయి అక్కడ ఎల్లప్పుడూ ఆ ధారలు అలా వస్తూనే ఉంటాయంటా. మంచినీళ్ళ డబ్బా లో ఆ నీళ్ళు పట్టుకుని కాసేపు అక్కడే ఉండి అక్కడి సుందర దృశ్యాలను ఫోటో లో పొందు పరుస్తూ మెల్లగా మెట్లు ఎక్కుతూ పైకి చేరుకుని అక్కడినుంచి హటకేశ్వరము చేరుకున్నాము. పూర్వము కుమ్మరి కేశప్ప అనే గొప్ప శివ భక్తుడు ఉండేవాడు అతను రోజూ శివ నామస్మరణ చేస్తూ కుండలు చేసి వచ్చిన డబ్బులతో శ్రీ శైలం వచ్చే యాత్రీకులకు భోజన సదుపాయాలు కలుగ చేస్తూ వారి ఆశీర్వాదం పొందుతూ ఉండేవాడు. అది చూసి తోటి కుమ్మరి వారు ఓర్వ లేక కేశప్ప జీవనాధారమైన కుండలు తయారు చేసే సారె ను తస్కరించగా కేశప్ప చేయునఆకూ ది లేక కొత్త సారెను తయారు చేసుకుని కుండలు చేయబోగా ఇంతలో నలుగురు సాధు పుంగవులు వచ్చి చాలా ఆకలిగా ఉంది త్వరగా భోజనము వడ్డించ వలసిందని కోరగా తన వద్ద ఏమీ లేకపోవడంతో కేశప్ప తనువు చాలించ తలపెట్టగా అంత ఆర్త జన రక్షకు డైన ఆ బోళాశంకరుడు కేశప్పకు కుండ పెంకు లో దర్శన మిచ్చి వరం కోరుకోమనగా కేశప్ప ఆ మహాదేవునికి తన్మయత్వం తో చేతులు జోడించి పాదాభివందనం చేసి నమస్కరించి స్వామీ నీవు ఎల్లప్పుడూ నా యందు ఉండి నా వృత్తికీ అన్నదానమునకు లోటు లేకుండా చేయమని కోరగా అటులనే అని ఆ దేవ దేవుడు అతనికి వరమొసంగి అక్కడే హటకేశ్వర స్వామిగా వెలిశారు. అటిక అనగా కుండ పెంకు,ఉట్టి అనే అర్ధాలు వస్తాయి కేశప్ప కు కుండ పెంకు లో దర్శనమిచ్చి అటికేశ్వర స్వామిగా వెలసినందువలన అటికేశ్వరము గా ప్రసిద్ధి చెంది కాల క్రమేణా హటకేశ్వరము గా పిలువబడుతుంది. హటకేశ్వర స్వామి గుడికి దగ్గరలో కేశప్ప కుండలు చేయుటకు వాడిన మంచినీళ్ళ బావి కలదు.
అందులో ఎల్లప్పుడూ నీళ్ళు ఉంటూనే ఉంటాయంట. హటకేశ్వర స్వామి గుడికి దగ్గరలోనే గాయత్రీ అమ్మవారి గుడి కనిపిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి గాయత్రీ మాత మనోహర మైన రూపంతో అలరారుతూ చిరునవ్వులు
చిందిస్తున్నారు. ఆ తల్లికి మనసారా నమస్కరించుకుని అక్కడినుంచి శిఖర దర్సనం కొరకు శిఖరేశ్వరము వద్దకు బస్సు వెళ్తూ ఉంది. శిఖరేశ్వరము సమీపించి మెట్లు ఎక్కుతూ వెళ్ళి అక్కడ ఒక తిరగలి లాంటి రాతి ఫలకము పైన
నందీశ్వరుని ప్రతిమ ఉంటుంది ఆ నందీశ్వరుని కి నవ ధాన్యములు సమర్పించి శిరః భాగమున చేయి వేసి మల్లికార్జున స్వామి ఆలయ శిఖరం చూడాలి. అలా శిఖర దర్సనం చేయుట సమస్త పాప హరణం. మేము నందీశ్వరుని దగ్గరకు వెళ్ళి నవధాన్యములు సమర్పించి నమస్కరించి దూరాన గల మల్లికార్జున స్వామి గుడి శిఖరం
వైపు చూడగా చాలా గోపురాలు కనిపిస్తున్నాయి. అలానే చూసి నమస్కరించుకుని మెట్లు దిగి కిందకు వచ్చి అక్కడ ఉన్న వీర శంకర స్వామి గుడి లోపలికి వెళ్ళి ఆ స్వామికి ప్రక్కన ఉన్న అమ్మవారికి నమస్కరించుకుని వెలుపలికి వచ్చి అక్కడ శివయ్య, అమ్మవారు, సహస్ర శివ లింగాలు షణ్ముఖ స్వామి, వినాయక స్వామి అందరూ ఉండి కైలసమా అనిపించేటటువంటి అద్భుత ప్రతిమలు చూసి నమస్కరించుకుని కొన్ని ఫోటోలు దిగి కిందకు వచ్చి బస్సు ఎక్కాము. ఈసారి చూడబోయే ప్రదేశం శ్రీ శైలం డ్యాం. కొంచెం సేపు ప్రయాణం చేసి డ్యాం దగ్గరికి వచ్చి ఆగింది బస్సు. బస్సు దిగి డ్యాం ఇంకా చుట్టూ పరిసరాలు చూస్తూ ఉంటే అక్కడి వాతావరణం చల్లగా ఉండి ఎంతో ఆహ్లాద కరంగా ఉంది. మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది. డ్యాం దగ్గర నీళ్ళు చాలా ఎత్తు నుండి పెద్ద శబ్దం చేస్తూ కిందకి పడుతూ ఉంటే ఆ దృశ్యం చాలా అందంగా అపురూపంగా ఉంది. ఆ సుందర దృశ్యం చూస్తూ
ప్రశాంత వాతావరణానికి కాసేపు అక్కడే ఉండి వచ్చి బస్సు లో కూర్చోగానే బస్సు తిరుగు ప్రయాణం సాగించి ఎక్కిన చోటికి వచ్చి ఆగింది. అక్కడినుంచి రూం కి వచ్చి భోజనం చేసి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని అన్నీ సర్దుకుని
రూం ఖాళీ చేసి స్వగృహమునకు తిరుగు ప్రయాణం సాగించాము. శ్రీ శైల యాత్ర ఇంత సంతోషంగా జరిగేలా చేసిన
ఆ శ్రీ శైల మల్లికార్జున స్వామికి భ్రమరాంబిక అమ్మవారికి మనస్పూర్తిగా ధన్యవాదములు తెలుపుకుంటూ మరొక్కసారి ఆ అర్ధనారీశ్వరులకు మనసారా నమస్కరించుకుని గుంటూరు వెళ్ళే బస్సు ల వద్దకు వచ్చాము.
శుభం భవతు
శివ శివేతి శివేతి శివే తివ భవ భవేతి భవేతి భవే తివ
హర హరేతి హరేతి హరే తివ భజ నమశ్శివ మేవ నిరంతరం
భజ నమశ్శివ మేవ నిరంతరం







