Monday, 5 December 2011

mahakalesvara jyotirlingamu in ujjayini (madhya pradesh)

                                                 
                                  నమస్తే  నమస్తే  హర హర  మహాదేవ శంభో  శంకర   పార్వతీ  మనోహర
   
   మహాదేవుని ఆజ్ఞ లేకుండా ఏమీ జరుగదు కదా.. తమను దర్శించుకునే భాగ్యం  ఆ  జగజ్జననీ జనకులు మాకు కలిగించుట వలనే ఆంధ్ర నుండి వచ్చి మహారాష్ట్ర.. మధ్యప్రదేశ్  ల లోని జ్యోతిర్లింగాలు చూడగలుగుతున్నాము. మహేశ్వరం  నుండి ఉజ్జయిని  నేరుగా వెళ్ళే బస్సులు  ఖాళీ లేక  మధ్యలో ఇండోర్ అనే ఊరి లో  దిగి వెళ్ళవచ్చని చెప్పారు. అలానే  ఇండోర్ వరకు వాన్  లు వెల్తున్నాయని  అక్కడికి వెళ్ళి చూస్తే అందులో కూడా ఖాళీ లేదు.  అప్పటికే  చాలా  సమయం వేచియుండడం తో చేసేది లేక ఆ వాన్ లోనే ఎలాగో సర్దుకుని కూర్చున్నాము. చాలా ఇరుకుగా ఉండి కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. ఇద్దరికీ అంతే..ఏం చేస్తాంలే అనుకుని పరిసరాలు గమనిస్తూ ఇండోర్  ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాము. అలా ఎదురు చూడటం వలనేమో చాలా సమయం గడిచినట్లు అనిపిస్తుంది.  కాసేపటికి ఇండోర్ వచ్చిందన్నారు. హమ్మయ్య అనుకుంటూ లేవబోతుంటే కాళ్ళు పట్టేసినాయి  అలాగే మెల్లగా లేచి, ఉజ్జయిని వెళ్ళే బస్సు కోసం చూస్తుంటే కొంత సేపటికి బస్సు వచ్చింది  కానీ ఎంత సేపైనా బయలు దేరకుండా ఇంకా ప్రయాణీకుల కోసం చాలా సేపు అక్కడే ఉంది.అంతే కాక బస్సు లో టీవీ, అందులో
హిందీ సినిమా లు పెద్ద శబ్దం తో  పెట్టారు. చేసేది లేక కిటికీ లో నుంచి చూస్తూ  ఉంటే అక్కడ ఒక పెద్ద చెట్టుకి ఆకులు
లేక,  ఆ చెట్టునిండా  చిన్న చిన్న పిట్టలు  అవే ఆకులు లాగా గుంపుగా ఉండి  చూస్తుంటే  బలే ముచ్చటేసింది. మేము అలా చూస్తూ ఉండగానే బస్సు కదిలింది  అవంతీ నగరం వైపు.  ఒకప్పటి అవంతీ నగరమే ఇప్పటి ఉజ్జయిని కదా..బస్సు  కిటికీ లో నుండి ప్రకృతి అందాలు చూస్తూ ఉన్నాము. అక్కడి పంట పొలాలు పచ్చగా కళ కళ లాడుతున్నాయి. ఎటు చూసినా గోధుమ పంటే..పట్టుకుచ్చులాగా  బంగారపు  రంగులో ఉండి చాలా అందంగా ఉంది. రహదారికి  ప్రక్కన అక్కడక్కడ  పెద్ద పెద్ద చెట్లకి  ఆకులు లేకుండా కేవలం ఎర్రటి పూలే గుత్తులుగా ఉండి చూడ ముచ్చటగా ఉన్నాయి.. అవి  వేసవి కాలం లోనే పూస్తాయట. చూస్తూ ఉండగానే  అవంతి లోకి అడుగు పెట్టాము. అప్పటికి రాత్రి 8 :30 అవటంతో  త్వరగా దగ్గరలో ఉన్న హోటల్ లో రూం తీసుకుని  స్నానం  చేసి ఆటో   లో మహాకాళేశ్వర  స్వామి గుడికి  బయలుదేరాం. ఎక్కువ సేపు పట్టకుండా త్వరగానే వెళ్ళాము.. ప్రక్కన షాపు లో పూలూ..ప్రసాదాలు తీసుకుని త్వరగా  వెళ్ళి వరుసలో నుంచున్నాం. మెల్లగా వరుస జరుగుతూ ఆ స్వామి కి దగ్గరవుతూ ఉన్నాము. మాకైతే  చెప్పలేని ఆనందం..ఆత్రుత..చూడబోతున్నామని  ఆనందం..ఎప్పుడెప్పుడా అనే ఆత్రుత రెండూ మమేకమై మా మదిలో   అదొక  అనిర్వచనీయమైన  హర్షాతిరేకం  కలుగుతుంది.. వరుసలో ఉన్న టీవీ లలో ఆ స్వామి కి జరిగే అభిషేకం,  పూజ చేసుకోవటం  చూపిస్తున్నారు. దారిలో అక్కడ ఉన్న ప్రమిద లో దీపారాధన చేసి.. మెల్లగా నడుస్తూ..నడుస్తూ   ఆ  ఆది మధ్యాంత రహితుడు.. సృష్టి  స్థితి లయ కారకుడు  అయిన అమ్మహాదేవుని  పద సన్నిధికి చేరుకొని.. సంభ్రమం తో అలానే చూస్తూ..  స్వామి  పార్ధివ అలంకరణ తో సాక్షాత్తూ ఆ కైలాస వాసి వచ్చికన్నుల ముందు ప్రత్యక్ష మైనట్లుంది..  తన్మయత్వం తో..  ఎన్ని జన్మల పుణ్యమో కదా తండ్రీ  నీ దర్సన భాగ్యం లభించడం..అనుకుంటూ..  మనసారా ఆ మహాకాళేశ్వర  స్వామిని  తడుముకుని  తలమోటించుకుని  కళ్ళకు అద్దుకుని  నమస్కరించుకుని..  అలంకరించిన  పార్ధివము  కొంచెం తీసుకుని బొట్టుపెట్టుకుని..  ఇంకొంచెం భద్రపరుచుకుని .. మెల్లగా బయటికి వచ్చి  ఆటోలో  నుంచి  దిగుతుంటే ఆటో అతను చెప్పాడు..మీకు ఉజ్జయిని లోని మిగిలిన పుణ్య క్షేత్రాలను చూపించుతాను  200 రూపాయలకు అని.. ఎటూ మేమూ చూడాలను కుంటున్నాము కదా అని సరే  రేపు 6 :30 కి రమ్మని చెప్పి.. రూం కి వచ్చి భోజనం చేసి,  తెల్లారి అయ్యవారి దర్శనార్ధం  త్వరగా లేవాలని  కునుకు తీసేందుకు  సమాయత్తమయ్యాము. మరుసటి రోజు అనగా సోమవారము  28 /3 /2011 న ఉదయం 6 :30 కే రెడీ అయి ఆటోకోసం ఎదురు చూస్తూ ఉండగా కొంచెం సేపటికి  వచ్చింది ఆటో.. ఎక్కి కూర్చుని వెళ్ళవలసిన దేవాలయముల  పేర్లుగల లిస్టు ఆటో అతను ఇస్తే చూస్తూ.. వివరములు మా బాబు అడిగి తెలుసు కుంటున్నాడు. అన్నీ హిందీ లోనే..  బాబు హిందీ లో చక్కగా మాట్లాడటం చూసి ఆటో డ్రైవర్ ..మీరు ఆంధ్రా వారైనా హిందీ  బాగా  మాట్లాడుతున్నారు..మేము చాలా సార్లు ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళకి హిందీ మాట్లాడటం కుదరక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము.. మీరు చక్కగా మాట్లాడుతుంటే  చాలా సంతోషంగా ఉంది అన్నాడు.
ముందుగా వినాయక స్వామిగుడికి వెళ్ళి దర్సనం చేసుకుని, అక్కడినుంచి  ఉజ్జయిని అమ్మ దగ్గరకు బయలుదేరాము. అక్కడి కాళీ మాతను ఉజ్జయిని అమ్మ అంటారు..అక్కడే కాళిదాసు అమ్మ కరుణా కటాక్షం పొంది
సకల విద్యా పారంగతుడై మహాకవి కాళిదాసైనాడు..దక్షిణాదిన  శ్రీశైలం లో శివయ్య  జ్యోతిర్లింగము, అమ్మ వారి శక్తి పీఠము  రెండూ ఒకేచోట  ఉన్నట్లుగా  ఉజ్జయినిలో  కుడా మహాకాళేశ్వర స్వామి జ్యోతిర్లింగము ,మహాకాళికా అమ్మ వారి శక్తి పీఠము రెండూ ఉజ్జయిని లోనే ఉండటం.. అలాంటి పుణ్య క్షేత్రాలని సందర్శించటం  దైవానుగ్రహం ఉంటేనే  సాధ్యమవుతుంది కదా అనుకుంటూ.. అదిగో ఉజ్జయిని అమ్మ దగ్గరకు వచ్చేశాం.. ఆటో దిగి గుడి లోనికి వెళ్తూ ప్రక్కనే  ఉన్న షాపు లో  పూలు, పళ్ళు ,ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు   తీసుకుని గుడి చుట్టూ తిరిగి గుడి  లోపలికి వెళ్ళాము.. ఎక్కువ జనం లేక పోవటంతో  చాలా ప్రశాంతంగా ఉంది.. అమ్మవారు  ముగ్ధ మనోహరంగా.. అభయ హస్తం తో భక్తులను ఆశీర్వదిస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటే మా హృదయం అనిర్వచనీయమైన  ఆనందంతో  ఉప్పొంగింది..మనసారా..తనివి తీరా అమ్మను చూసుకుని పూజ చేసుకుని  చాలా సేపు అక్కడే కూర్చుని  ఆ తల్లి కి ప్రణమిల్లి.. నమస్కరించుకుని  ఆటో అతను వేచియున్నాడు కదా  అనుకుని  వచ్చి ఆటో ఎక్కి కూర్చోగానే  డ్రైవర్  చెప్పాడు ఈసారి  మంగళ నాధ్ స్వామి గుడికి అని..కాసేపటికి వచ్చాము.. అక్కడ షాపులో ఎర్రని పూలు, చిన్న ఎర్రని వస్త్రము ప్రసాదాలు మొదలగునవి తీసుకుని  గుడి లోపలికి  వెళ్ళి  అక్కడ నలుగురు పూజ చేసుకుంటూ ఉంటే కొంచెం సేపు ఆగి లోపల స్వామిని చూస్తూ ఉన్నాము. అక్కడా శివ లింగమే..  అంటే మంగళ నాధుడు  శివుని కుమారుడు కదా..ఉజ్జయిని  మంగళ నాధుని జన్మ స్థలమంట. ప్రత్యేకంగా ఆ స్వామికి గుడి కూడా ఉజ్జయిని లోనే ఉన్నదంట..స్వామి  శివ లింగ రూపం లోనే ఉండి భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారన్నమాట. లోపలి వాళ్ళు వచ్చేయగా మేము లోపలికి వెళ్ళి  స్వామి ప్రక్కనే కూర్చుని వెంట ఉన్న పూలు,  ప్రసాదాలు సమర్పించి పూజ చేసుకుని  నమస్కరించుకుని వచ్చి ఆటోలో మళ్ళీ పయనం సాగించాం. ఈ పర్యాయము  కాల భైరవ స్వామి గుడికి.. పది నిమిషాల్లో చేరుకొని  ఆటో దిగి షాపులో స్వామికి పూలు, దారాలు  ప్రసాదం..మద్యం సీసా.. స్వామికి పోస్తా రంట ఒకటి తీసుకుని గుడి లోపలికి వెళ్ళాము. లోపల కొంతమంది స్వామికి పూలు పళ్ళతో పాటు  మద్యం పూజారికి ఇవ్వగా..పూజారి  స్వామికి నోట్లో  కొంచెం పోసి కొంచెం ప్రసాదంగా  ఇస్తున్నారు. మేము తీసుకెళ్ళిన  పూలు పళ్ళు మద్యం  స్వామికి సమర్పించి నమస్కరించుకుని వెలుపలికి  వచ్చి ప్రక్కనే ఉన్న దత్తాత్రేయ స్వామి గుడి లోనికి వెళ్ళి స్వామికి నమస్కరించుకుని వచ్చి ఆటో లో పర్యటన కొనసాగించాము..  మనం చిన్నప్పుడు చదువుకున్న చందమామ కధల కధా నాయకుడు విక్రమార్కుడు అవంతీ నగర వాసియే కదా.. అతను  కొలువుతీరిఉన్న అతని ప్రతిమ, ప్రక్కన చాలా చిన్న చిన్న బొమ్మలు..దగ్గరికి వెళ్ళి చూసి  వచ్చి ఆటోలో  కులదేవతా శక్తి పీఠము ఉన్నదని ఆటో అతను అక్కడకు తీసుకెళ్ళగా  దిగి అమ్మ వారికి పూలు  ప్రసాదం తీసుకుని గుడి లోనికి వెళ్ళి  ప్రసన్నమైన  ఆ ఆదిపరాశక్తి  అమ్మ ను  కన్నులారా వీక్షించి నమస్కరించుకుని  వచ్చి ఆటోలో కూర్చున్నాము.ఆటో అతను ఉజ్జయిని లో ప్రవహించే క్షిప్రా నది దగ్గర రామ్ ఘాట్ అంటారంట అక్కడికి తీసుకెళ్ళాడు..ఆటో దిగి క్షిప్రా నదీమ తల్లి దగ్గర కాళ్ళు కడుక్కుని  వచ్చి ఆటోలో కూర్చోగానే.. మహాకాళేశ్వర  స్వామి గుడి వద్ద దింపి అక్కడ దర్సనం ఆలస్యం గా అవుతుందని వెళ్ళాడు. మాకూ అదే మంచిదనిపించింది..ఎంత సేపైనా ఉండి ప్రశాంతంగా దర్శించుకోవచ్చు  అనుకుని అక్కడ ఉన్న క్షిప్రా నదీ కుండం లో కాళ్ళు కడుక్కుని,  స్వామికి పూలు, పళ్ళు దారాలు కొని వెళ్ళి వరుసలో నుంచున్నాము..అప్పటికి మధ్యహ్నం 12  దాటింది మేము ఏమీ తినలేదు..నీరసముతో వరుసలో చాలా సేపు నిలబడ లేక కూర్చున్నాము. కొంచెం సేపటికే  వరుస జరగటం మొదలైంది..హమ్మయ్య అనుకుంటూ లేచి ఆ మహాకాళేశ్వర  స్వామిని చూడబోతున్నామని  ఉరకలేసే ఉత్సాహంతో ముందుకు కదులుతూ..ఇంకొంచెం  జరుగుతూ..ఆ అదిగో ఆ దేవ దేవుడు..మహాదేవుని.. చరణ సన్నిధికి చేరుకొని..తన్మయత్వంతో ఆ మహాకాళేశ్వర లింగము  అంత దగ్గరగా చూస్తుంటే ఆనందంతో అలానే చూస్తూ.. ఆ స్వామిని చేతులతో తాకి, కళ్ళకు అద్దుకుని  పూలు, పళ్ళు సమర్పించి పూజ చేసుకుని  జన్మ ధన్యమైంది తండ్రీ నీ దర్సన భాగ్యంతో  అనుకుంటూ నమస్కరించుకుని  అక్కడి నుంచి రాలేక..రాలేక బయటికి  వచ్చి అక్కడ ఉన్న నందీశ్వరునికి  నమస్కరించుకుని  వెలుపలికి వచ్చి పైన ఓంకారేశ్వర స్వామి  గుడి లోనికి వెళ్ళి  (ఒక విశేష మేమిటంటే ఓం కారేశ్వరం లో అమరేశ్వర  స్వామికి పైన మహా కాళేశ్వర స్వామి ఉంటే ఇక్కడ  మహాకాళేశ్వర స్వామికి పైన ఓంకారేశ్వర  స్వామి ఉంటారు.) ఆ స్వామికి నమస్కరించుకుని..ప్రక్కన ఇంకా చాలా శివ లింగాలు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి..స్వప్నేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకుని..ఓంకారేశ్వర స్వామి గుడి ప్రక్కన గల రాతి ఫలకము పైన ద్వాదశ జ్యోతిర్లింగాలు..ఊరి పేర్లు రాసి ఉన్నాయి. అక్కడే గుళ్ళో చాలా సేపు కూర్చుని, ఫోటోలు దిగి  ఓంకారేశ్వర  స్వామికి పైన ఒక శివాలయం ఉందంట..అక్కడ కేవలం నాగ పంచమి రోజు మాత్రమే తలుపులు తీస్తారంటా.. మిగిలిన రోజుల్లో తీయరంటా.. అందుకని అక్కడికి వెళ్ళలేదు..మా నానీ.. స్వామి ప్రసాదం టికెట్  తీసుకుంటానికి వెళ్ళగా.. అక్కడి వారు అన్నదానం టికెట్ ఇచ్చారు..అప్పుడు తెలిసింది గుడి లో అన్నదానం జరుగుతుందని.. ఆ మహా కాళేశ్వర  స్వామీ మహాకాళికా అమ్మ వార్ల అనుగ్రహం వలనే ఈ విధంగా అన్నదానం టికెట్ లభించిందనుకుని.. భోజన సత్రం..  గుడికి కొంచెం దూరం లో అని తెలుసుకుని ఆటోలో
అక్కడికి చేరుకున్నాము.  అప్పటికి కొందరు తింటూ ఉన్నారు..వారి ప్రక్కన టేబుల్ పైన ఎవరైనా వస్తారని విస్తర్లు పరచి ఉంచారు.. మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాము. ఎదురుగా టీవీ లో గుడి లో మహాకాళేశ్వర  స్వామికి జరిగే
పూజాదికాలు  చూపిస్తున్నారు..వడ్డన మొదలైంది..అన్నం తో పాటుగా బేల్ పూరీ, పప్పు,ఇంకా 2 రకాల కూరలు,
పాయసం..ఇన్ని రకాలా.. అవి ఎంత బాగున్నాయో..సాక్షాత్తూ ఆ అన్నపూర్ణేశ్వరీ  దేవి వచ్చి వడ్డించినట్లు గా అనిపించింది. వారు మళ్ళీ  మళ్ళీ  కావాలా అని అడుగుతూ ఉంటే ఎంత ఓర్పుగా వడ్డన చేస్తున్నారు..అనుకుని
తృప్తిగా తిని.. తోచిన విరాళమిచ్చి  సంతోషంగా అక్కడినుంచి హోటల్ రూం కి  వచ్చాము. అప్పటికి సాయంత్రం 4 అవుతుంది.. ముంబయ్ కి 5 గంటలకు రైలు ఉంది..స్టేషన్..  రూం కి చాలా  దగ్గరేకదా అని కాసేపు విశ్రాంతి తీసుకుని లేచి  అన్నీ సర్దుకుని.. ఉజ్జయినీ యాత్ర శుభప్రదంగా  జరిగేటట్లు చేసిన ఆ మహాకాళేశ్వర  స్వామికీ  మహాకాళికా అమ్మ వారికీ మనస్పూర్తిగా ధన్యవాదములు  చెప్పుకుంటూ.. హోటల్ నుంచి రైల్వే  స్టేషన్ కి వచ్చి కూర్చున్నాము. 15 నిమిషాలకే రైలు వచ్చింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఉజ్జయినిలో  రైలు  ఎక్కితే మరుసటి రోజు ఉదయం 5 : 30 కి గోరీవలీ లో దిగి  అక్కడి నుంచి సిటీ రైలు లో ముంబయ్ వచ్చి,  అక్కడి నుంచి ఆటోలో పవాయ్ లోని  మేముంటున్న ఇంటికి వెళ్ళేసరికి ఉదయం 6 : 30 అయినది. హే సర్వాంతర్యామి  మహేశ్వరా..ధన్యోస్మి తండ్రీ
అనుకుంటూ  విశ్రాంతి తీసుకున్నాము.

                              నమస్తే  నమస్తే మహాదేవ శంభో.. నమస్తే నమస్తే దయాపూర్ణ  సింధో..                                                          
                               నమస్తే  నమస్తే  ప్రపన్నాత్మ బంధో.. నమస్తే  నమస్తే నమస్తే  మహేశా..
                             
                                                                     శుభం భవతు.

No comments:

Post a Comment