ఓం నమశ్శివాయైచ నమ శ్శివాయ.
ఓం కారే అమరేశ్వరం. ఆంధ్రా నుంచి మహారాష్ట్ర వచ్చిన అమ్మకు వీలైనప్పుడల్లా దగ్గరలోని జ్యోతిర్లింగములను దర్శించుకునే భాగ్యము కలిగించాలని మా బాబు తాపత్రయం. అమ్మతో కలిసి ఆ అర్ధనారీశ్వరులను దర్శించుకోవటం బాబుకి బహు మక్కువ. ఈసారి మధ్య ప్రదేశ్ లో ఉన్న ఓంకారే శ్వరం, అలాగే ఉజ్జయిని క్షేత్రాలని సందర్శిద్దామని అనుకున్నాం. మార్చి 25 రాత్రి ముంబయ్ లో 8 : 30 బయలుదేరి ఖాండ్వా వరకు రైలు లో వెళ్ళి, అక్కడి నుంచి ఓం కారేశ్వరం వెళ్లేసరికి ఉదయం 11 : 30 అయినది. గుడికి దగ్గరలోనే ఒక హోటల్ లో రూం తీసుకున్నాము. రెండో అంతస్తు లో ఉన్న రూం నుంచి చూస్తే ఓంకారేశ్వరస్వామి గుడి, దూరంగా ఉన్న పెద్ద శివుని ప్రతిమ చక్కగా కనిపిస్తున్నాయి. కాసేపు విశ్రాంతి తీసుకుని కొంచెం అల్పాహారం తిని, 3 : 30 కి గుడికి బయలుదేరాము. ఓంకారేశ్వరం చేరే ముందు నర్మదా నది రెండుగా చీలి ఆ స్వామి గుడి చుట్టూ ప్రవహించి మళ్ళీ ఒక చోట కలుస్తుంది. మేము నర్మదా నదీమ తల్లికి నమస్కరించి, ఓంకారేశ్వర ఘట్టం లో స్నానం చేసి గుడిలోనికి వెళ్ళాము.
గుడిలో ప్రవేశించడానికి ముందు అక్కడ ఉన్న వినాయక స్వామికి, నందీశ్వరునికి నమస్కరించి లోపలికి వెళ్ళాము. అద్భుతం, అమోఘం. అమరేశ్వర స్వామి ని చూట్టానికి రెండు కళ్ళు చాలవనిపించింది. శివయ్య వెనుకే అమ్మవారు చాలా మనోహరంగా ఉన్నారు. జ్యోతిర్లింగం ఓం ఆకారం లో ఉన్నట్లు ఉంటుంది. పూలు,ప్రసాదం ఆ ఆది దంపతులకు సమర్పించి కాసేపు అక్కడే కూర్చుని మనసారా ధ్యానించుకున్నాము. ఇక్కడ జ్యోతిర్లింగము తాకకూడదట, తాకటానికి వీలు లేకుండా కడ్డీలు అడ్డం ఉన్నాయి. ఆ జగజ్జననీజనకులను కన్నులారా వీక్షించి నమస్కరించుకుని ఇంకా జనం వస్తూ ఉండడంతో వచ్చిహాలులోకూర్చున్నాము. బాబు అన్నాడు, మళ్ళీ వెళ్ళి వద్దామని. సరే అని ఒకరి తర్వాత ఒకరం వెళ్ళి వచ్చాము. పూజారులు గుర్తు పట్టి ఎన్ని సార్లు వస్తారు అని అన్నారు (హిందీలో). అంటేలే అని చక్కగా తనివి తీరా దర్శనం చేసుకుని నమస్కరించుకుని వచ్చి కూర్చున్నాము. పక్కనే నర్మదా నది ప్రవహిస్తూ, నదికి ఆవలి వైపున ఉన్న పరిసరాలు కనిపిస్తూ చాలా సుందరంగా ఉంది దృశ్యం. అక్కడినుంచి ఉన్న మెట్ల ద్వారా పైకి వెళ్తే ఇంకొక శివలింగం (మహాకాళేశ్వర స్వామి), అమ్మవారు ఉన్నారు. ఆ పైన సన్నగా ఇంకొక మెట్ల దారి ఉంది. అందులోనించి వెళ్తుంటే ఒక గుహ లాగా చీకటిగా ఉంది. అలాగే వెళ్తే అక్కడ శివ లింగాలు, ఎటుచూసినా శివయ్యే.
ఓంకారేశ్వర క్షేత్రం లో విశేషం పరిక్రమ. ఓంకారేశ్వర ద్వీపం చుట్టూ నడుస్తూ, అక్కడ ఉన్న అనేక క్షేత్రాలను, ఆలయాలను దర్శించడం అన్నమాట. పరిక్రమ చేద్దామనుకుని సాయంత్రం 5 గంటలకు మొదలు పెట్టాము. 3 గంటలకు పైగా పడుతుంది అని చెప్పారు. అక్కడక్కడ చిన్నగుడిసెలు ఉన్నాయి. అప్పుడప్పుడు వాటిలో నివాసం ఉండే గ్రామస్తులు తారసపడుతున్నారు. దారిలో సింటెక్స్ ట్యాంక్లలో మంచినీళ్ళు అందుబాటులో ఉన్నాయి. .నర్మదా నీళ్ళే కదా, చాలా బాగున్నాయి. దారిలో ఉన్న దేవాలయాలు దర్శించుకుంటూ వస్తున్నాము. ఎంతో పురాతనమైన ఆ ఆలయాలు ఈ క్షేత్రం యొక్క చరిత్రను స్ఫురణకు తెస్తున్నాయి. ఆ సాయంవేళలో అలా నర్మదా పరీవాహంలో నడుస్తుంటే నీరసమే తెలీలేదు. ఏదో కొత్త చైతన్యం పుట్టుకొచ్చింది. సాయంభానుని అనన్య శోభకి పరిసరాలన్నీ సిందూర వర్ణం లో శోభిస్తున్నాయి. మునుపెన్నడూ చూడనంత సౌందర్యం నలువైపులా వెల్లివిరిసింది. కొంత సేపటికి పవిత్ర నర్మదా నదీ సంగమం చేరుకున్నాము. ఆహా ఎంత అద్భుతం, అంత దగ్గరగా ఆ సంగమం, ఆ జల పాత హోరు ప్రత్యక్షంగా చూస్తుంటే ఆ ఆనందం వర్ణనాతీతం. పరిక్రమ చేసే మార్గంలో శిలాఫలకముల పై భగవద్గీతా శ్లోకాలను భావసహితంగా చెక్కి ఉంచారు. ప్రాచీన కాలం నాటి అపురూపమైన గౌరీ సోమనాథ దేవాలయం చేరుకున్నాం. ఆ కళా నైపుణ్యం మహాద్భుతం. లోపల విశాలమైన, ఏంతో ఎత్తైన పెద్ద శివ లింగం. వెలుపల కూడా చాలా పెద్ద నందీశ్వరుడు. అప్పుడు సాయంత్రం 6 : 30 అయింది. ప్రదోష సమయం కదా. ఆ నాట్య కళా సాకార తాండవ శోభనామూర్తి శివశంకరునికి మనస్పూర్తిగా పూజచేసుకుని, తృప్తిగా నమస్కరించుకుని పయనం సాగించాము. వెళ్తూ ఉండగా, హోటల్ రూం నుంచి కనిపించిన అతి పెద్ద మహాదేవుని ప్రతిమని చేరుకున్నాము. ఆకాశమే ఆహార్యమై అలరారు తున్నట్లు గా మహోన్నతంగా ఉంది. విగ్రహం కింద భాగంలో ఆలయం ఉంది. ప్రహరీ గోడ చుట్టూ 18 అమ్మవారి శక్తి ప్రతిమలు ఉండి ఎంతో శోభాయమానంగా అలరారుతున్నాయి. అడుగడునా సుందర దృశ్యాలను బాబు తన కెమేరాలో పొందుపరుస్తున్నాడు. అప్పటికి చీకటి పడుతుంది. లైట్లు కొంచెం దూరంగా ఉండడం తో సెల్ లో లైటు సహాయంతో, శివ నామ స్మరణతో నడుస్తూ ఉన్నాము. మెట్లు ఎక్కేటప్పుడు నాకు కొంచెం కష్టంగా ఉంటే బాబు మెల్లగా చేయి పట్టుకుని తీసుకొస్తున్నాడు. ఆ..అదిగో గుడి కనిపిస్తుంది.. వచ్చేశాం. అవునా మేమేనా అంత దూరం నడిచింది. అంతా ఆ అమరేశ్వరుని దయ. ఎలా నడుస్తామో అనుకున్న మాకు కొంచెం కూడా అలసట కానీ, కాళ్ళు నొప్పులు కానీ తెలీలేదు. ధన్యోస్మి మహాదేవా అనుకుంటూ త్వరగా గుడిలోనికి వెళ్ళి, మరలా దర్శనం చేసుకున్నాము.
అమలేశ్వర జ్యోతిర్లింగం నుంచి విభజించబడి నర్మదా నదికి మరో ఒడ్డున వెలిసిన జ్యోతిర్లింగమే మామలేశ్వర లింగం. అక్కడినించి మామ లేశ్వర స్వామి గుడికి వడి వడి గా బయలుదేరాము. రాత్రి 8 : 30 దాటడంతో తలుపులు వేస్తారేమో అని చాలా వేగంగా వెళ్ళి గుడికి చేరుకున్నాము. ఆహా ఏమి మా అదృష్టం. మా మనః పారవశ్యాన్ని వర్ణింపనలవి కాదు. అక్కడ మామలేశ్వర స్వామికి అభిషేకము, పూజ చేస్తున్నారు. పూజారి చాలా వయో వృద్ధులు. కానీ వృద్ధాప్యం వయసుకే గాని, మనో నిశ్చయానికి కాదు అన్నట్లు వారు ఎంతో భక్తి భావన తో స్పష్టంగా మంత్రోచ్ఛారణ చేస్తూ స్వామికి అభిషేకము, పూజ చేస్తుంటే మా మది హర్షాతిరేకంతో పొంగిపోయింది. అక్కడ ఇంకా నలుగురు ఆడవారు కూర్చుని ఉన్నారు. మేము ప్రక్కన పూజ చూస్తూ కూర్చున్నాము. హారతి తీసుకుని మహాదేవునికి, అమ్మవారికి నమస్కరించుకుని తృప్తిగా అక్కడినించి కదిలాము. వస్తూ గుడి ఆవరణ లోనే ఉన్న శివాలయాలు సందర్శించి రూం కి వెళ్ళేసరికి రాత్రి 9 : 30 అయింది. దగ్గరలో ఉన్న హోటల్ కి వెళ్ళి ఆలూ పరాటా, పన్నీర్ పరాటా కొంచెం అన్నం తో భోజనం చేసి రూం కి వెళ్ళి ఉదయం త్వరగాలేచి శివయ్యని చూడాలి అనుకుంటూ నిద్రకు ఉపక్రమించాము.
తెల్లవారు ఝాము 4 : 30 కి లేచి 5 గంటలకు పవిత్ర నర్మదా నది లో స్నానం చేసి మామ లేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళాము. అప్పటికే స్వామికి అభిషేకం చేస్తున్నారు. కొంచెం సేపు కూర్చుని హారతి తీసుకుని లోపలికి వెళ్ళాము. ఆ దేవ దేవుని తన్మయత్వం తో అలా చూస్తూ ప్రక్కనే కూర్చుని పూజా ద్రవ్యాలతో పూజారుల సహకారం తో అభిషేకం, పూజ చేసుకుని తనివి తీరా నమస్కరించుకున్నాము. ఓంకారేశ్వర స్వామిని తాకటానికి వీలు లేదనేమో, మామలేశ్వర స్వామిని తాకి, ఇంత తృప్తిగా సేవించుకోడానికి ఇక్కడ జ్యోతిర్లింగముగా వెలిశారు. అక్కడినించి మళ్ళీ ఓంకారేశ్వర స్వామి గుడి కి వెళ్ళి మాతా పితలకు మనసారా మ్రొక్కి వచ్చాము. ఉదయం 9 : 30 కు మహేశ్వరం వెళ్ళే బస్సు ఉండడం తో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ యాత్ర ఇంత మహత్తరంగా జరిగేటట్లు చేసిన ఆ సర్వేశ్వరునికి మనసులోనే ధన్యోస్మి ఓం కారే అమరేశ్వరం మామలేశ్వరం. ఓం నమః శివాయ హర హర మహాదేవ అనుకుంటూ మహేశ్వరం వెళ్ళటానికి బస్సు దగ్గరకు వెళ్ళాము. తదుపరి మహేశ్వర యాత్రా విశేషాలు చెప్పుకుందాము.
సర్వేజనా సుఖినో భవంతు.

No comments:
Post a Comment