Monday, 5 December 2011

mahesvaram in madhyapradesh

                                                         
                                                        నమో  నమః శంకర  పార్వతీభ్యాం.
 ఓం కారేశ్వరంలో ఉదయం 9 :30 కి బస్సు ఎక్కితే మహేశ్వరం  వచ్చేసరికి  మధ్యాహ్నం  12 : 30 అయింది. బస్సు మేము మహేశ్వరం కోట వరకు రాకుండా  రహదారి పైన దించి వెళ్ళిపోయింది. అక్కడినించి  ఎటు వెళ్ళాలో, ఎంత దూరమో ఏమీ తెలీదు. దగ్గరే ఉన్న షాపు వాళ్ళను అడిగితే ఇక్కడినించి  రెండు కిలోమీటర్లు దూరంలో ఉంది మహేశ్వరం కోట, ఆటోలు  వెళ్తాయి అని చెప్పారు. మిట్ట మధ్యాహ్నం 1 అవుతుండడం తో  ఎండ విపరీతంగా ఉంది.. మార్చి నెల కూడా మూడు రోజుల్లో వెళ్ళబోతుంది  కదా ఎండ సహజమే. కానీ మధ్య ప్రదేశ్ లో ఎండా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. రెండు పుచ్చకాయ ముక్కలు కొని, చల్లగా ఉంటుందని పెదాలకు రాసుకుంటూ కూర్చున్నాము. కాసేపటికి ఒక ఆటో వచ్చింది కానీ చాలా ఎక్కువ అడుగుతున్నాడనిపించింది. చూద్దామని  కొంచెం సేపు ఐస్ క్రీం తింటూ కూర్చున్నాము. అక్కడ ఐస్ క్రీం చాలా చౌక 5 రూపాయలకే  చాలా మంచివి ఉన్నాయి. చాలా బాగుంది ఐస్ క్రీం. తింటూ ఉండగానే ఆ ఒక్క ఆటోకూడా  వెళ్ళబోతుంటే ఇంక చేసేది లేక  ఎక్కి కూర్చున్నాము. కోటకు కొంచెం దూరం లో ఆటో ఆగగా దిగి, కొబ్బరికాయలు అమ్ముతున్న మామ్మ గారి వద్ద కొబ్బరి కాయలు కొని లగేజీ అక్కడే ఉంచి  ఉత్సాహంగా  కోట ముఖద్వారం గుండా లోనికి వెళ్ళాము.



అంత పెద్ద కోటని దగ్గరగా చూడటం అదే ప్రధమం. విశాలమైన ప్రాకారం. నాలుగు వైపులా చాలా పెద్ద  గోడలు. ఎలా కట్టారో అంత ఎత్తైన  పటిష్ఠ మైన రాజ ప్రాకారాలు.  చూస్తుంటే బలే అబ్బురమేసింది.  రాజ ప్రాసాదం లోపల ఒక పెద్ద  శివాలయం.  శివుడు రాజరాజేశ్వర నామంతో కొలువైయున్నాడు. రాణి ఆహిల్యాబాయి గొప్ప శివ భక్తురాలంట.  ఆమె నిత్య శివారాధనతో ఈ ఆలయంలో తరించేదట.  పుణ్య నర్మదా నది లోని మట్టితో శివ లింగం చేసి పూజించేదట. ఆ ఆలయం యొక్క శిల్ప కళా నైపుణ్యత ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. గుడి ఆవరణలోనూ, బయట ఉన్నఅనేకమైన స్తంభాలు విశిష్టమైన సౌందర్యం కలిగియున్నాయి. ప్రతి రెండు స్తంభాలపై ఉన్న ఆకారాలు ఎంతో అందంగా ఉన్నాయి. గుడిలోనే కాదు, కోటలో అడుగడుగునా అపురూపమైన నిర్మాణ ప్రతిభ కనిపిస్తూ ఉంది. కోట ప్రాకారంలో ఉన్న ఖాళీలనుంచి నర్మదా నది కనిపిస్తూ ఉంటుంది. కోట నుంచి నర్మదా నది వైపు బయటికి వెళ్ళడానికి విశాలమైన మెట్లు. ఈ మెట్ల యొక్క ఆకారం కూడా ప్రత్యేకమే. ఇంత ప్రత్యేకత ఉండ బట్టే ఎన్నో సినిమా షూటింగ్లు జరుగుతాయి ఇక్కడ. సఖి సినిమాలోని స్నేహితుడా పాట ఇక్కడే తీశారు. నర్మదా నది ప్రక్కనే ఎన్నో చిన్న చిన్న శివ లింగాలు ఉన్నాయి. అలాగే చాలా  ఆలయాలు కూడా ఉన్నాయి. నర్మదా నదీమ తల్లికి నమస్కరించుకుని  కాళ్ళు కడుక్కుని ఒక గుడి లోపలికి వెళ్ళి ఆ  మహేశ్వరునికి, అమ్మవారికి, వెలుపల ఉన్న నందీశ్వరునికి నమస్కరించుకున్నాము. అక్కడ రాణి  అహిల్యాబాయి అర  చేతిలో శివలింగం పెట్టుకుని హృదయానికి హత్తుకుని  కూర్చున్న ఫోటో ఉంది. ఆమెను చూస్తుంటే రాణి లా లేదు. చాలా సామాన్యంగా, ప్రశాంతమైన  మోముతో భక్తి భావంతో  వెలుగుతూ ఉంది. ఆ ఊరిలో ఆమెను దేవత లా పూజిస్తారంట. ఆమెకు మనః స్మరామి.

ఆ కోటంతా చుట్టూ చూద్దామని వెనుకకు వెళ్ళగా కోటకు, గుళ్ళకు పైన మూలల్లో పెద్ద పెద్ద  తేనె తుట్టెలు ఉన్నాయి.  ఒళ్ళు జలదరించింది. ఎన్ని చూసినా ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం వారు ఈ కళాత్మక, చారిత్రాత్మక ప్రదేశం యొక్క ఉద్ధరణకి కొంత శ్రద్ధ చూపిస్తే బాగుంటుందని అనిపించింది. మహేశ్వరం చేనేత  వస్త్రాల తయారీకి చాలా ప్రసుద్ధి. ఇక్కడి నేత వస్త్రాలు అసాధారణ ఖ్యాతి గాంచాయి. కోట లోపలే నేత తయారీ చేసే సంస్థలు ఉన్నాయి. ఒక  లాగా విశాల మైన ప్రదేశంలో ఉండి, అందులో ఆడవారు  మగ్గం  నేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.  తయారైన చీరలు చూశాము. చాలా అందంగా పాఠశాల ఉన్నాయి. అప్పటికి మధ్యాహ్నం 2  అవుతుండడంతో ఆకలి  వేసి  నీరసం వచ్చింది. దగ్గరలో ఏదో చిన్న సత్రం లాంటిది ఉందని చెప్పగా  కోట నుండి వెలుపలికి వచ్చి అక్కడికి వెళ్ళాము. అక్కడ చాలా ప్రశాంతంగా మన ఇంటిలో ఉన్నట్లు ఉంది. కూర్చుంటానికి   పీటలు, ఎదురుగా తినటానికి విస్తర్లు వేశారు. టేప్ రికార్డు లో లింగాష్టకం వస్తుంది. బాలు గారు పాడిన ట్యూను కాకుండా మార్పుగా ఉన్నా కూడా వినసొంపుగా ఉంది.  మమ్మల్ని ఆ పీటల మీద కూర్చోమని  ఏమి కావాలి  అని హిందీలో అడిగారు. చావల్  అన్నాము. అంటే అన్నం కదా. వారు 2 రోటీలు, కొంచెం అన్నం, 4 రకాల కూరలు  విస్తర్లో వడ్డించారు. అన్నం మరీ కొంచెమే అవటం తో మళ్ళీ అడిగాము. వాళ్ళు చక్కగా వడ్డిస్తున్నారు. కాకపోతే అక్కడి వారు  అన్నం తినడం తక్కువ. రోటీలు  ఎక్కువ తింటారు కదా. వారిలో ఒకతను మేము అన్నమే తినటం చూసి  మీరు ఆంధ్రా వాళ్ళా అని అడిగితే  మాకు నవ్వు వచ్చింది.  కూరలు,రోటీలు కూడా బాగున్నాయి.  చాలా తృప్తిగా తిన్నాము. అన్నట్టు అక్కడి భోజనం కేవలం  25  రూపాయలే. ఇంత  చక్కగా ఇంటిలో  తిన్నట్లు ఉంటే అంత తక్కువ రేటుకే మంచి భోజనమా అని ఆశ్చర్యపడ్దాం. వడ్డించిన పిల్లవానికి ఇంకో పది రూపాయలు ఇచ్చి బైటికి వచ్చాము. లగేజి  పెట్టిన షాపు వద్ద లగేజి తీసుకుని ఆటోలు ఉన్నాయేమోనని  చూడగా ఒక్క ఆటో కూడా లేదు. ఇప్పుడేమీ  ఆటోలు  రావంట, బస్సుల దగ్గరికి వెళ్ళాలంటే  ఒక మైలుకి పైగా నడవాలి. మిట్ట మధ్యాహ్నం కావటం తో ఎండ విపరీతంగా ఉంది. ఇంక చేసేది లేక నేను ఒక బాగ్ భుజాన పెట్టుకుని. బాబు రెండు పెద్ద  బాగ్ లు, ఇంకో పెద్ద కవరు తీసుకుని ఎలాగో బస్సు దగ్గరికి చేరుకున్నాం. మహేశ్వరం యాత్ర సంతోషమయమైనందుకు ఆ మహేశ్వరునికి ధన్య వాదములు చెప్పుకుంటూ ఉజ్జయిని వెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. తదుపరి ఉజ్జయిని యాత్రా విశేషాలు చెప్పుకుందాము.
                                                                శుభం భవతు.


1 comment:

  1. రాణి అహల్యాబాయి గారు గొప్ప శివభాక్తురాలు - ఆమె కట్టించిన గుడిని చూడటం నిజంగా అదృష్టమే. ఈ గుడి గురించి తెలియని చాలా విషయాలు తెలియజేసారు - ధన్యవాదాలు.

    ReplyDelete